గురువారం 26 నవంబర్ 2020
Medak - Oct 22, 2020 , 00:36:51

అమరుల త్యాగం.. చిరస్మరణీయం

అమరుల త్యాగం.. చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి కుటుంబీకులకు అండగా ఉంటాం.. అని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బుధవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్‌ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు.  పోలీసు అమరవీరుల మార్గదర్శకాన్ని అనుసరిస్తూ  చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పని చేయాలని పోలీసులకు సూచించారు. 

అమరుల కుటుంబీకులకు అండగా ఉంటాం  - కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సిద్దిపేట టౌన్‌ : పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. పోలీసు అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం పోలీసు ఫ్ల్లాగ్‌డే నిర్వహించారు.  కలెక్టర్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీపీ జోయల్‌ డెవిస్‌, పోలీసు అధికారులు పోలీసు అమరవీరుల కుటుంబీకులతో కలిసి పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతూ ప్రాణాలను తెగించి పోలీసులు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు.  

పోలీసులు త్యాగం చేయని రోజు ఉండదు.. 

పోలీసులు త్యాగం చేయని రోజంటూ ఉండదని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము అని, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛిన్నకర శక్తులతో నేరస్తులు, అసాంఘిక కార్యకమాలకు పాల్పడే వారిపై అనుక్షణం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ఈ ఏడాది 262 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. అమర పోలీసు కుటుంబీకులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌లు ఓదార్చి, వారిని శాలువాతో సన్మానించి కానుకలను అందజేశారు.  పోలీసు రిలేటెడ్‌ షాట్‌ఫిల్మ్‌ కాంపిటేషన్‌లో విజేతలకు నగదు బహుమతి అందజేసి మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషినల్‌ డీసీపీలు బాపురావు, రియాల్‌ ఉల్‌హక్‌, ఏసీపీలు విశ్వప్రసాద్‌, శ్రీనివాస్‌, బాలాజీ, సీఐలు సైదులు, పరశురామ్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.   

అమర పోలీసులకు ఘన నివాళి

మెదక్‌ కలెక్టరేట్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఇన్‌చార్జి ఏఎస్పీ సీతారాం, జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు జిల్లా పోలీసు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరుల కుటుంబీకులకు అండగా ఉంటామన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మెదక్‌ జిల్లా అమరవీరుల కుటుంబాలను అదనపు ఎస్పీ పరామర్శించారు. అమరుల కుటుంబీకులకు శాలువా కప్పి సన్మానించారు. అమరుల కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ తరఫున 2012లో బస్‌ పాస్‌ అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ వారికి జాబ్‌ ఐ.డీ కార్డులను, జ్ఞాపికలను అందజేశారు. 

అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన పోలీసులు..

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మృతి చెందిన 264 మంది పోలీసు అమరవీరులు, మెదక్‌ జిల్లాకు చెందిన 14 మంది పోలీసు అమరవీరుల త్యాగాలను జిల్లా ఇన్‌చార్జి ఏఎస్పీ సీతారాం, జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మెదక్‌ డిఎస్పీ కృష్ణమూర్తిలు స్మరించుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్‌చార్జి అదనపు ఎస్పీ సీతారాం, డీఎస్పీ కృష్ణమూర్తి, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, మెదక్‌ రూరల్‌ సీఐ పాలవెల్లి, ఆర్‌ఐ సూరపునాయుడు, డీసీఆర్‌బీ సీఐ చందర్‌రాథోడ్‌, ఎస్‌బీ ఎస్సై సందీప్‌రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు..

జిల్లాల వారీగా పోలీసు సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కానిస్టేబుల్‌ నుంచి ఐఎస్‌ఐ విభాగంలో మొదటి బహుమతి పొందిన ఎస్‌బీ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ, రెండో బహుమతి పొందిన ఐటీ కోర్‌ కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌, మూడో బహుమతి పొందిన చిల్పిచేడ్‌ మహిళా కానిస్టేబుల్‌ శ్రీలేఖకు, ఎస్సై విభాగంలో మొదటి బహుమతి పొందిన సందీప్‌రెడ్డి, రెండో బహుమతి పొందిన టేక్మాల్‌ ఎస్సై లింబాద్రిలకు బహుమతులను అందజేశారు.  వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం ‘పోలీస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా పోలీసు రిలేటెడ్‌ అంశం మీద ‘సలాం పోలీసు’ షార్ట్‌ఫిలిం తీసి పంపిన రంగంపేట గ్రామానికి చెందిన సైఫొద్దీన్‌కు మొదటి బహుమతి, తూప్రాన్‌కు చెందిన సాయమొల్ల రాజు తీసిన ‘ఓ పోలీసు అక్క’ షార్ట్‌ ఫిలింకు రెండో బహుమతి, ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన అంజాగౌడ్‌ తీసిన ‘జయహో పోలీసు’కు మూడో బహుమతిని అందజేశారు. 

అమరుల త్యాగాలు మరువలేనివి.. - సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

సంగారెడ్డి టౌన్‌ : విధి నిర్వహణలో అమరుల త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీసు ఫ్ల్లాగ్‌ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరుల కుటుంబాలకు సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లాకు చెందిన నలుగురు  జవాన్లు వీరమరణం పొందారని, సిర్గాపూర్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పోలీసు స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీసు స్టేషన్‌కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీసు స్టేషన్‌కు చెందిన సురేశ్‌ వివిధ సంఘటనల్లో  ప్రాణాలను అర్పించారన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు.   విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు, ఆన్‌లైన్‌లో ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌, ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం, జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ కె.సృజన, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌నాయుడు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, సంగారెడ్డి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, సంగారెడ్డి రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు దుర్గారెడ్డి, కోశాధికారి ఆసిఫ్‌ అలీ, పోలీసు అమరవీరుల కుటుంబీకులు పాల్గొన్నారు.