శనివారం 05 డిసెంబర్ 2020
Medak - Oct 21, 2020 , 00:31:38

మున్సిపాలిటీ పరిశుభ్రతకై మరుగుదొడ్ల ఏర్పాటు

మున్సిపాలిటీ పరిశుభ్రతకై మరుగుదొడ్ల ఏర్పాటు

ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం

మున్సిపాలిటీలో 4 యూనిట్ల 

మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక

మూడు యూనిట్ల పనులు ప్రారంభం

హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు

నర్సాపూర్‌ రూరల్‌ :  మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలనే  సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపడుతోంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదని మున్సిపాల్టీలోని ప్రధాన కూడలిలో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇన్ని రోజులూ పట్టణవాసులు పడిన ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. జన సంచార ప్రాంతాలైన ప్రభు త్వ దవాఖాన, తూప్రాన్‌ రోడ్డు, ఆర్టీసీ బస్టాప్‌, సాయి డీలక్స్‌ ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 4 యూనిట్ల మరుగుదొడ్లను నిర్మించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొదటగా మూడు యూనిట్లలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రతి యూనిట్‌కు ఒక బోరును ప్రత్యేకంగా వేయించారు.  ఒక యూనిట్‌లో స్త్రీలకు 2, పురుషులకు 2 మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. నిర్మించిన అనంతరం వాటి నిర్వాహణ కోసం ప్రైవేట్‌ వ్యక్తులకు మున్సిపాలిటీ వారు అప్పగిస్తారు. పే అండ్‌ యూజ్‌ అనే పద్ధతిలో వాటిని కొనసాగిస్తారు. ఒక్కో యూనిట్‌ నిర్మాణానికి 8 నుంచి 10 లక్షల ఖర్చు వస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తయి ఆచరణలోకి వస్తే పట్టణంలో అపరిశుభ్రత   తగ్గుతుందని, పట్టణం స్వచ్చంగా ఉంటుందని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేస్తాం

మున్సిపాలిటీలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. వచ్చే నెల మొదటివారంలో నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తాం. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యతతో నిర్మాణాలు చేయిస్తున్నాము. వీటి నిర్మాణంతో పట్టణం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. పట్టణ ప్రజలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి.

-రమణమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌