గురువారం 26 నవంబర్ 2020
Medak - Oct 21, 2020 , 00:31:28

వేర్వేరు చోట్ల నీటమునిగి ఇద్దరి మృతి

వేర్వేరు చోట్ల నీటమునిగి ఇద్దరి మృతి

రామాయంపేట రూరల్‌ : కుంటలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రామాయంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయిలాపూర్‌లో జరిగింది. పోలీసులు, కుటుంబీకుల  వివరాల ప్రకారం... మండలంలోని రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ పాషా (22) సోమవారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి గ్రామ శివారులోని పోతాయికుంటలోకి ఈతకు వెళ్లారు. కాగా సాయంత్రం సమయం కావడంతో మహమ్మద్‌ పాషా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంత గాలించినా ఫలితం దక్కలేదు. మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపడుతుండగా పాషా మృతదేహం లభ్యమైంది. దీంతో రామాయంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి చాంద్‌పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మిట్టపల్లి గుండ్లచెరువులో...

సిద్దిపేట అర్బన్‌ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మిట్టపల్లి గుండ్లచెరువులో జరిగింది. సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌ వివరాల ప్రకారం... సిద్దిపేట అర్బన్‌ మండలం బొగ్గులోనిబండకు చెందిన అందె చిన్న బాలయ్య (55) మిట్టపల్లి గుండ్ల చెరువులో సోమవారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మధ్యాహ్నం బాలయ్య మృతదేహం లభ్యమైంది. బాలయ్య కుమారుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.