శనివారం 16 జనవరి 2021
Medak - Oct 20, 2020 , 05:29:35

దళారులను నమ్మి నష్టపోవద్దు

దళారులను నమ్మి నష్టపోవద్దు

 అక్కన్నపేట: మండలంలోని జనగామ, గోవర్ధనగిరి, రామవరం, అంతకపేట గ్రామాల్లో సెర్ఫ్‌ ద్వారా గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గోవర్ధనగిరిలో ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరి ధాన్యం గ్రేడ్‌ ఏ రకంకు రూ. 1880, సాధారణ రకం రూ. 1868 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్‌, సీసీలు తిరుపతి, రాజు, శివ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కత్తుల మానస, పీచర సునీత, వనపర్తి స్వప్న, ఇర్రి లావణ్యరాజిరెడ్డి, రైతులు ఉన్నారు. 

హుస్నాబాద్‌ మండలంలో...

హుస్నాబాద్‌రూరల్‌: మండలంలోని పోతారం(ఎస్‌), బంజేరుపల్లి గ్రామాల్లో  ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఐకేపీ సిబ్బంది, ఏఈవోలు పాల్గొన్నారు. 

జగదేవ్‌పూర్‌ మండలంలో...

జగదేవ్‌పూర్‌: మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు   ఐకేపీ , పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.   మండల కార్యాలయంలో హార్వెస్టర్‌ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని, రైతులు అధైర్యపడకుండా  వరి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు.  

   హార్వెస్టర్ల ద్వారా వరి పైరును కోసేటప్పుడు తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. తాలుతో వచ్చిన ధాన్యాన్ని తిరిగి పట్టాలాంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని, వరిని కోసే దశలో తాలు రాకుండా హార్వెస్టర్‌ యజమానులు యంత్రాలను చూసుకోవాలన్నారు. మండలంలోని జగదేవ్‌పూర్‌, ఇటిక్యాల, పీర్లపల్లి, రాయవరం,  చిన్నకిష్టాపూర్‌ గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో తీగుల్‌, తీగుల్‌ నర్సాపూర్‌, చాట్లపల్లి, మునిగడప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అందుబాటులో తాలు పట్టే మిష న్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రైతులు తమ ధాన్యానికి సంబంధించిన వివరాలను ఏఈవోల ద్వారా ధ్రువపత్రం పొంది కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధికారులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.