మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Oct 17, 2020 , 05:04:21

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది.ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 నామినేషన్ల సెట్లను దాఖలు చేశారు.నామినేషన్ల గడువు ముగియడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించేలా పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు వెళ్తున్నది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ గ్రామాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీలు తమ వెంట తెచ్చుకున్న నాయకులతోనే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసి మమ అనిపించి వెళ్తున్నారు.ఆ పార్టీలకు గ్రామాల్లో క్యాడర్‌ లేకుండా పోయింది. ఉన్న వారంతా వరుస కట్టి టీఆర్‌ఎస్‌లో చేరారు. 

 దూసుకుపోతున్న గులాబీ దండు...                                                                            

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్‌ 3న జరగనున్నది. సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావుతో పాటు ఇతరులు కొందరు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉద్యమాల గడ్డ అయిన దుబ్బాక నియెజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీనిచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీని అక్కున చేర్చుకున్నారు.  నెల రోజులుగా పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ముందుకు కదులుతున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొనేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత వెంట మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మహిళా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్‌, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తమకు బాధ్యతలు అప్పగించిన మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌, ఇతర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో యువత, విద్యార్థి విభాగాల నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సుజాతను గెలిపించాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.  

డిపాజిట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల పాకులాట...

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని వెంట తెచ్చుకున్న నాయకులతోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు వచ్చి రెండు మూడు రోజులు ప్రచారం చేశారు. వీరికి ఆయా గ్రామాల్లో క్యాడర్‌ లేక సతమతమవుతున్నారు. గ్రామాల్లో ఆ పార్టీలకు ఆదరణ కరువైంది. ఏ ఊరికి వెళ్లినా ఇదివరకు ఏం చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు...మీకు ఎందుకు ఓటు వేయాలి ..? అంటూ ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. ఎన్నికలప్పుడే మీరు మా వద్దకు వస్తారు తప్పా...ఎన్నికలు అయిపోయాక ఇటు మోహం కూడా చూపించరు. మీకు మేం ఎలా ఓట్లు వేస్తామంటూ బహిరంగగానే ఓటర్లు చెప్పడంతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బిత్తర పోతున్నారు. చేసేది ఏమిలేక ఓ నాలుగు రోజులు ప్రచారం చేసామా..? పోయామా...? వచ్చామా....? అనే తరహాలో వారు ఉన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. దీంతో రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. కనీసం డిపాజిట్‌ అయినా దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఏదిఏమైనా పరువు కోసం ఆ రెండు పార్టీలు పాకులాడుతున్నాయి అని చెప్పాలి.


logo