శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Oct 16, 2020 , 02:14:07

ఇంటి అనుమతి సులభం

ఇంటి అనుమతి సులభం

  •  21 రోజుల్లోనే మంజూరు
  •  నిబంధనలకు విరుద్ధంగా  నిర్మాణం చేపడితే చర్యలు
  •  స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

మెదక్‌ కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వం  వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ టీఎస్‌ బీ-పాస్‌(టీఎస్‌ బిల్డింగ్‌ అప్రూవుల్‌ అండ్‌ సెల్ప్‌ సర్టిఫికేషన్‌ సిస్టం)ను అమల్లోకి తెచ్చింది. నూతన మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం భూ యజమానులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుం డా ఎవరినీ కలువాల్సిన పని లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పర్మిషన్‌ వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకురావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

 ఆన్‌లైన్‌లో అనుమతులు...

 ఇల్లు అనుమతి కోసం నెలలు తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా సులభంగా అనుమతులు వచ్చేలా టీఎస్‌ బీ-పాస్‌ను తీసుకొచ్చింది. భూ యజమానులు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా స్వీయ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లోనే సంబంధిత పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకునేలా వెబ్‌సైట్‌ను రూపొందించిం ది. యజమాని స్వయంగా , ఇంజినీర్‌తో tsbpass. telangana.govt.in లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే స్థల విస్తీర్ణాన్ని బట్టి అందులోనే ఫీజులు నిర్ధారించి, సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు.

బీ పాస్‌తో మేలు..

టీఎస్‌ బీ-పాస్‌తో పట్టణాల్లో భవన నిర్మాణాలకు అనుమతి కూడా లభిస్తుంది. 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నిర్మించే భవనాలు పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో జారీ చేస్తారు. నివాసేతర భవనాలకు కూడా ఆర్కిటెక్ట్‌తో అటెస్ట్‌ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఇస్తారు. 75 చదరపు గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.

లే అవుట్లకు 21 రోజుల్లో అనుమతి...

స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తాత్కాలిక లే అవుట్‌ ప్లాన్‌ అనుమతిని ఆన్‌లైన్‌లో 21 రోజుల్లో జారీ చేస్తారు. లే అవుట్‌ పూర్తి చేసిన తర్వాత లైసెన్స్‌ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్‌ చేయించి, జిల్లా కమిటీలు పరిశీలించాక లే అవుట్‌ తుది అనుమతులను జారీ చేస్తారు.  మున్సిపల్‌ కమిషనర్ల వద్ద తనఖా రూపంలో పెట్టిన ప్లాట్లను లే అవుట్‌ తుది అనుమతి ఇచ్చిన 21 రోజుల తర్వాత విడుదల చేస్తారు.

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా...

బీ-పాస్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే సరి లేదంటే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమతులు పొందిన భవనాల వివరాలను బీ-పాస్‌ యాప్‌లో నమోదు చేస్తారు. వీటిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఇంజినీరింగ్‌ అధికారులతో కూడిన ట్రాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం భవన నిర్మాణం జరుగుతుం దా.. లేదా పర్యవేక్షిస్తారు. తేడాఉన్నా.. అనుమతి లేకున్నా .. ప్లాన్‌కు విరుద్ధంగా జరిగే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారు. ఎలాంటి నోటీసులు లేకుండా నిర్మాణాలను కూల్చివేస్తారు.  సదరు ప్రాపర్టీని సీజ్‌ చేస్తారు. అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధి చేసిన డెవలపర్‌కు ఆ భూమి విలువలో 25 శా తం ఫైన్‌ వేస్తారు. అక్రమ లే అవుట్‌ వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌కు సర్వే నంబర్‌తో సహా నివేదికలను అందజేస్తారు. దీంతో లే అవుట్‌ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చే య డం కుదరదు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ నిక్షిప్తం కాకపోవడంతో భవన నిర్మాణాలకు అనుమతులు లభించవు. ఇలా నూతన విధానంలో అందరికీ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.logo