ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Oct 10, 2020 , 01:45:58

లక్ష మెజార్టీ ఖాయం

లక్ష మెజార్టీ ఖాయం

  • బీజేపీ, కాంగ్రెస్‌ చేసింది ఏమీ లేదు
  • గ్రామాల అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డు
  • కాళేశ్వరం నీటితో రైతుల పాదాలను కడుగుతాం
  • రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • కన్నీళ్లతో ముందుకు వచ్చిన సుజాతను గెలిపించాలి
  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

రాయపోల్‌: పేదలకు కాంగ్రెస్‌, బీజేపీ చేసింది ఏమీ లేదు.., మాయమాటలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నరు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రజలు ఆశీర్వాదాలతో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాయపోల్‌ మండలంలోని పెద్ద ఆరెపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నమాసాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, మరోపక్క కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బోరుబావుల వద్ద మీటర్లు పెడుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.10 వేల కోట్లు తీసుకుని రాష్ర్టానికి ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరాయన్నారు. ముఖ్యంగా పింఛన్లు, కేసీఆర్‌కిట్‌, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్‌, కాల్వాల ద్వారా సాగునీరందిచడంతో పాటు మరెన్నో పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రతిపక్షాల నాయకులు ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని, ఓట్ల కోసం వస్తే వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఆధరించి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు.

ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తా..

తన భర్త రామలింగారెడ్డి మరణంతో తాను ఎంతో బాధలో ఉన్నానని ఆయన 24 గంటల పాటు ప్రజల కోసమే ఆలోచించేవారు. వారి అభివృద్ధి కోసమే పాటు పడేవారు. ప్రస్తుతం మన మధ్యలో లేకపోవడంతో ఆయన ఆశయాలను కొనసాగించేందుకు సీఎం కేసీఆర్‌ తనకు అవకాశం ఇచ్చాడని ప్రజలందరూ ఆశీర్వదించి ఉప ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం లింగన్న ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, మార్కెట్‌ చైర్మన్‌ పడకంటి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ చెరుకు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, జహీరాబాద్‌ ఎమ్మెల్యే, మండల ఇన్‌చార్జి మాణిక్‌రావు, రైతు బంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు తిగుళ్ల స్వామి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌ మండలాధ్యక్షుడు బెండ మధు, మండల కో-ఆప్షన్‌ సభ్యులు పర్వేజ్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి గుప్త, ఉమ్మడి జిల్లా నాయకులు వుడేం కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రచారానికి బ్రహ్మరథం

మండలంలోని పల్లెపల్లెనా టీఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందుకున్నది. శుక్రవారం మండలంలోని చిన్నమసాన్‌పల్లి, లింగారెడ్డిపల్లి, పెద్ద ఆరెపల్లి గ్రామల్లో దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు, డప్పువాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని ఉత్సాహంతో చెబుతున్నారు.

మీ లింగన్న లాగే నన్నూ ఆశీర్వదించండి...

గజ్వేల్‌ రూరల్‌: ‘మీ లింగన్న లాగే నన్నూ ఆశీర్వదించండి.. మీ అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా’ అని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ మండలం చిన్న ఆరెపల్లెలో మండల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగన్న మృతితో పుట్టెడు దుఃఖంలో ఉండి మీ ముందుకు వచ్చా. ఇంటి ఆడబిడ్డలా నన్ను దీవించండని కోరారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా రామలింగారెడ్డి అందరికీ అందుబాటులో ఉండి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, నేను కూడా ఆయనలా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అంతకుముందు ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాణిక్యరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, జడ్పీటీసీ మల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.


logo