ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Oct 07, 2020 , 03:05:06

బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

దుబ్బాక : రైతులను రోడ్డున పడేసిన కేంద్ర బీజేపీ సర్కారుకు.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్‌కు దుబ్బాకలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం దుబ్బాక రెడ్డి సంఘంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తిమ్మాపూర్‌ ఎంపీటీసీ మాధవి, మాజీ సర్పంచ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి, దుబ్బాకకు చెందిన టీజీవీపీ నాయకులు చరణ్‌తేజతో పాటు సుమారు 100మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రైతులను గోస పెట్టే బీజేపీకి, దుబ్బాకలో సాగు నీరు అడ్డుకున్న కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో సోలిపేట రామలింగారెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు సుజాతక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదు.. : మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

మోసపూరిత బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియడారు. ప్రతి ఇంట్లో ఏదో రకమైన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకంలో లబ్ధ్ది పొందుతున్నారని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పడో ఖాయమైందన్నారు. ప్రతి పక్షాలకు డిపాజిట్‌ గల్లంతేనన్నారు. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ సంక్షేమం, దుబ్బాక అభ్యర్థి సానుభూతికి సంబంధించినవన్నారు. ప్రతి పక్షాల మోసాలను ఎండగట్టి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


logo