గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Oct 06, 2020 , 00:59:07

‘సింగూర్‌' పవర్‌ షురూ..

‘సింగూర్‌' పవర్‌ షురూ..

పుల్కల్‌: ఎట్టకేలకు రెండేండ్ల తర్వాత సింగూర్‌ ప్రాజెక్టులోకి భారీ నీటి ప్రవాహం రావడంతో సింగూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగూర్‌ దిగువన మంజీరా బ్యారేజ్‌కి ఇన్‌ఫ్లో లేకపోవడంతో మిషన్‌ భగీరథ తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. దీంతో మంజీరా బ్యారేజ్‌లోని తాగునీటి పథకాలకు నీటిని సింగూర్‌ ప్రాజెక్టు నుంచే సరఫరా చేయాలి. కాగా, సింగూర్‌ జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నీటిని విడుదల చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ, దిగువన మంజీరాలోకి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించి విద్యుత్‌ ఉత్పత్తికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ 0.5 టీఎంసీల నీటిని విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి కావడమే కాకుండా మంజీరా బ్యారేజ్‌లో ఉండే చక్రియాల, నర్సాపూర్‌ మిషన్‌ భగీరథ తాగునీటి పథకాలకు నీటిని సరఫరా చేస్తూ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్సుకు కూడా నీటిని అందిస్తున్నారు.

తొలిరోజు 0.348 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి..

మంజీరా బ్యారేజ్‌లోకి సింగూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంతో ఆదివారం సాయంత్రం నుంచి 0.5 టీఎంసీల నీటిని రెండు రోజుల పాటు విడుదల చేస్తున్నారు. ఈ నీటితో విద్యుత్‌ కేంద్రం అధికారులు రెండు టర్బయిన్లను రన్‌ చేసి  విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌ ద్వారా రోజుకు 7.5 మెగావాట్‌ సామర్థ్యం గల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మొదటి 24 గంటల్లో రెండు టర్బయిన్లకు 243.878 ఎంసీఎఫ్‌టీ నీటిని వాడుకుని, 0.348 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏడీఏ సౌజన్య తెలిపారు. 2018 తర్వాత డ్యాంలోకి ఈ సారే వరదలు రావడంతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉన్నదని ఆమె తెలిపారు. డ్యాంలోకి వరదలు వస్తున్న సమయంలోనే ప్లాంట్లో టర్బయిన్‌ను వెట్‌ ట్రయల్‌ నిర్వయించాం, ప్రభుత్వం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయమని ఉత్తర్వులు రావడంతో అంతరాయం లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నీటి పారుదలశాఖ అధికారులు విద్యుత్‌ ప్లాంట్‌కు 0.5 టీఎంసీల నీటిని రెండు రోజుల పాటు సరఫరా చేస్తుండడంతో ఆ నీటితో 0.720 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు.

ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో...

సింగూర్‌ ప్రాజెక్టుకు సోమవారం 682 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 24.423 టీఎంసీల నీరున్నది. ఇందులో నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం 0.25 టీఎంసీలు, మిషన్‌ భగీరథకు 30 క్యూసెక్కులు, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్సుకు 30 క్యూసెక్కులు విడుదల చేయగా, 300 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నాయని అధికారులు తెలిపారు.


logo