గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Oct 02, 2020 , 00:57:43

జోరందుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌

జోరందుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌

 మెదక్‌ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ జోరందుకున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4668 దరఖాస్తులు వచ్చాయి. మొదట్లో అంతంత మాత్రంగా ఉన్న దరఖాస్తుల ప్రక్రియ, గడువు సమీపిస్తుండడంతో వేగం పుంజుకున్నది. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 15 తేదీతో ముగియనున్నది. కాగా, మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.                   

ఇప్పటి వరకు 4668 దరఖాస్తులు..

మెదక్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. మెదక్‌ మున్సిపాలిటీలో 3079 పాట్లు, తూప్రాన్‌ మున్సిపాలిటీలో 4528, నర్సాపూర్‌లో 2083, రామాయంపేటలో 3024 ప్లాట్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ పెరిగింది. గతంలో గజం ధర రూ.10వేలు ఉండగా, ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతున్నది. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌తో ఆస్తులను క్రమద్ధీకరించుకుంటున్నారు. 

తూప్రాన్‌ మొదటి స్థానం..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో జిల్లాలో తూప్రాన్‌ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఉండగా, మెదక్‌ మున్సిపాలిటీ రెండు, నర్సాపూర్‌ మున్సిపాలిటీ మూడు, రామాయంపేట మున్సిపాలిటీ నాల్గో స్థానంలో ఉన్నది. కాగా, మెదక్‌ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. అయితే గతంలో గ్రామ పంచాయతీల పరిధిలో ఉండడంతో వీటిల్లో చాలా వరకు పంచాయతీ తీర్మానంతోనే వెంచర్లు వెలిశాయి. వీటికి డీటీపీసీ అనుమతి ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వెంచర్లకు అనుమతి లేకపోవడం, గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది. 

 మున్సిపాలిటీలకు ఆదాయం..

ఎల్‌ఆర్‌ఎస్‌తో మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 4668 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. దీంతో  మున్సిపాలిటీలకు రూ.46 లక్షల 68వేల సమకూరింది. వచ్చే నెల 15వ తేదీతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల గడువు ముగియనుడడంతో  ప్లాట్ల యజమానులు మున్సిపాలిటీల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. 

ఈ నెల 15 వరకే గడువు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనున్నది. మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేని వెంచర్లు, ప్లాట్ల యజమానులు దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించాం.  దరఖాస్తుల స్వీకరణకు మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశాం

- శ్రీహరి, మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌


logo