సోమవారం 30 నవంబర్ 2020
Medak - Sep 29, 2020 , 23:25:49

‘ఢీ’జేపీ

 ‘ఢీ’జేపీ

 • వికారాబాద్‌లో రెండు వర్గాలుగా చీలిన బీజేపీ 
 • జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకంపై బేధాభిప్రాయాలు
 • అనుభవం, అర్హత లేకున్నా పదవి ఇచ్చారని ఆగ్రహం
 • మెజార్టీ అభిప్రాయాన్ని పార్టీ పట్టించుకోలేదని ఆవేదన
 • మంత్రి శ్రీనివాస్‌ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు
 • కోర్‌ కమిటీని తప్పుదోవ పట్టించారని ఆరోపణలు
 • నూతన అధ్యక్షుడిని వ్యతిరేకిస్తున్న వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల నేతలు
 •  వికారాబాద్‌లో రెండు వర్గాలుగా చీలిన బీజేపీ 
 • కొత్త అధ్యక్షుడి నియామకంపై బేధాభిప్రాయాలు
 •  పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు
 • కొత్త జిల్లా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తున్న వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల నేతలు
 • వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం ఆ పార్టీలో కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నది వికారాబాద్‌  జిల్లాలోని నాయకుల మధ్య బేధాభిప్రాయాలకు కారణమై, రెండు వర్గాలుగా చీలిపోయారు. మొన్నటి వరకు జిల్లా అంతటా బూత్‌ కమిటీలు వేసి మెజార్టీ అభిప్రాయం పొందిన వారికి కాకుండా తక్కువ మెజార్టీ వచ్చిన, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని వారికి అధ్యక్ష పదవి కట్టపెడతారా అంటూ ఆ పార్టీ కోర్‌ కమిటీ సభ్యులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన ఆశావహులు బహిరంగంగానే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని బలంగా తయారు చేసేందుకు ఓ వైపు ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్‌ వ్యూహాలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలోని నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి పార్టీని రోడ్డుకు లాగుతుండడం ఆ పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తున్నది. మరోవైపు కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడిని కలుపుకుపోయే ప్రసక్తే లేదని జిల్లాకు చెందిన పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. మరీ కొత్త జిల్లా అధ్యక్షుడి నియామక వివాదాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రంగంలోకి దిగి చల్లార్చుతుందో లేదంటే అసమ్మతి నేతలపై వేటు వేస్తారనేది త్వరలో తేలనుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన అధ్యక్ష నియామకంతో జిల్లా బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే జిల్లా అధ్యక్ష పదవి కోసం మొదటి నుంచి  ప్రస్తుతం అధ్యక్షుడిగా నియమితులైన సదానంద్‌ రెడ్డితోపాటు రమేశ్‌కుమార్‌, శివరాజ్‌, మాధవ రెడ్డిలు  ఆశించారు. అధ్యక్ష పదవికోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. 

  అయితే కొత్త అధ్యక్షుడిగా నియమించేందుకుగాను ఆ పార్టీ అధిష్టానం జిల్లాలోని సీనియర్‌ నేతలు, ముఖ్యమైన కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. అయితే అభిప్రాయ సేకరణలో 60 శాతం తాండూర్‌కు చెందిన రమేశ్‌కుమార్‌కు మద్ధతుగా అభిప్రాయం వెల్లడించగా తర్వాత శివరాజ్‌, మాధవరెడ్డి, సదానంద్‌ రెడ్డిల వైపు మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే రమేశ్‌కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి, ఎన్నికల అనంతరం తిరిగి పార్టీలో చేరడంపై విమర్శలు రావడం, తాండూర్‌లోని మరో వర్గం నేత పటేల్‌ రవిశంకర్‌ ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఆయనకు పదవి దక్కకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. రమేశ్‌కుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించవద్దని నేరుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కోర్‌ కమిటీలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ అభిప్రాయం వ్యక్తం చేయడంతోపాటు శివరాజ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలంటూ మద్ద తు పలికినట్లు తెలిసింది. అయితే మెజార్టీ అభిప్రాయం పొందిన రమేశ్‌కుమార్‌ను, లక్ష్మణ్‌ మద్దతు తెలిపిన శివరాజ్‌కు కాకుండా సదానంద్‌రెడ్డివైపు ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో శివరాజ్‌తోపాటు మాధవరెడ్డి పలువురు తాండూర్‌ నాయకులు సదానంద్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడో ఒకసారి పాల్గొనే, మెజార్టీ అభిప్రాయంలేని సదానంద్‌ రెడ్డికి అధ్యక్ష పదవినివ్వడంపై మాధవరెడ్డి, శివరాజ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడైన మంత్రి శ్రీనివాస్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని, పార్టీ కోసం పనిచేసే వారికి పదవులివ్వాలని, పైరవీలు చేసే వారికి కాదని మంత్రి శ్రీనివాస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాండూర్‌కు చెందిన పలువురు నేతలు కూడా సదానంద్‌ రెడ్డిని వ్యతిరేకించారు. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశించిన రమేశ్‌కుమార్‌తోపాటు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌ రావు తదితరులు పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సదానంద్‌ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఇలా జిల్లా నేతలు రెండు వర్గాలు విడిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు జిల్లాలో తలెత్తిన ఈ వివాదంపై చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ జనార్ధన్‌ రెడ్డి స్పందిస్తూ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడిన నలుగురు అర్హులేనని, కానీ అందరికి న్యాయం చేయలేమని, మిగతా వారికి కూడా పార్టీ అధిష్టానం సముచిత న్యాయం చేస్తుందని, పార్టీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించి, సమిష్టిగా ముందుకు పోవాలన్నారు.