సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Sep 29, 2020 , 23:25:49

మూడేండ్ల మురిపెం

మూడేండ్ల మురిపెం

  • ఆశలు నిలిపిన సింగూరు..
  • మూడేండ్ల తర్వాత ప్రాజెక్టుకు జలకళ 
  • వానకాలం ఆఖరులో ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో
  • ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు
  • ప్రస్తుతం 24.223 టీఎంసీలకు చేరిన నీటిమట్టం 
  • కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..పూర్తిగా నిండే అవకాశం 

మూడేండ్ల తర్వాత సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రం వరకు 24.224 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో మరో వారం రోజులు కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండనుంది. ఈ వానకాలం ఆరంభం నుంచి ఆశించిన వరద రాక సింగూరు ప్రాజెక్టు వెలవెలబోయింది. దాదాపు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. తీరా ఈ నెలలో ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురిసి భారీ ఇన్‌ఫ్లో కొనసాగడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలోకి చేరింది. సాగు, తాగునీటికి ఢోకా ఉండదని సంబురపడుతున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ వానకాలం ఆరంభం నుంచి ఆశించిన వరద రాక సింగూరు ప్రాజెక్టు వెలవెలబోయింది. దాదాపు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. తీరా ఈ నెలలో ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురిసి భారీ ఇన్‌ఫ్లో కొనసాగడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మరో నాలుగు టీఎంసీల వరద వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు, తాగునీటికి ఢోకా ఉండదని సంబురపడుతున్నారు. 

మూడేండ్ల తర్వాత..

మూడేండ్ల తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి తిరిగి నీళ్లొచ్చాయి. కేవలం అర టీఎంసీ సామర్థ్యానికి పడిపోయి, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో స్థానికులు మురిసిపోతున్నారు. ఈ నీటితో నాలుగు మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ‘మిషన్‌ భగీరథ’ ద్వారా తాగునీటికి ఇక ఢోకా ఉండదు. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రం వరకు 24.224 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో మరో వారం రోజులు కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పది రోజులుగా సందర్శకులతో సింగూరు ప్రాజెక్టు కిటకిటలాడుతున్నది. ప్రాజెక్టును చూడడానికి రోజువారీగా వందలాది మంది తరలివస్తున్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. మూడేండ్ల నుంచి నీళ్లు లేక ఇటువైపు ఎవరూ రాలేదని, ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం కనిపిస్తున్నదని చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.85 కోట్లతో కాలువల నిర్మాణం..

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్న ప్రాజెక్టుల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగానే సింగూరు ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది. రూ.45 కోట్లతో సివిల్‌ వర్క్స్‌, మరో రూ.20 కోట్లు భూసేకరణకు వెచ్చించారు. రూ.19.80 కోట్లతో లిఫ్ట్‌ పనులు పూర్తి చేయించారు. దాదాపు రూ.85 కోట్లతో ప్రాజెక్టును ఆధునీకరించారు. కాలువలు మరమ్మతు చేయడంతో 2016లో ప్రాజెక్టులోకి నీళ్లు రాగా, 40వేల ఎకరాలకు సాగునీరందించారు. అప్పుడు నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు రోజువారీ పరిశీలన, సమీక్షల ద్వారా పనులు పూర్తి చేయించారు. ఇంకా కూడా పిల్ల కాలవల పనులు జరుగుతున్నాయి. 2017లో కూడా పుల్కల్‌, అందోలు మండలాలకు సాగు నీరందించారు. 1988 ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ కాలువల పనులు చేపట్టలేదు. గత ప్రభుత్వాలు సాగుకు చుక్క నీళ్లు అందించలేకపోయాయి. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం 2016, 2017 సంవత్సరాల్లో పంటలకు నీళ్లందించి స్థానిక రైతుల మన్నన్నలు పొందింది.

సాగుకు, తాగుకు ఇక ఢోకాలేదు...

సింగూరు ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌, అందోలు, సదాశివపేట, మునిపల్లి మండలాల్లో మొత్తం 40 వేల ఎకరాలకు ఇక సాగునీళ్లు అందనున్నాయి. ప్రాజెక్టులోకి వచ్చిన నీళ్లును చూసి స్థానిక రైతులు మురిసిపోతున్నారు. అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ రైతులతో కలిసి గంగమ్మకు పూజలు చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌, మెదక్‌ జిల్లాలోని ఘనపురం ఆయకట్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. ఈసారి స్థానిక అవసరాలకే వాడుకుంటామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌కు తాగునీటిని కూడా సింగూరు నుంచి తరలించేవారు. అక్కడకి కృష్ణా జలాలు వస్తుండడంతో తరలించే అవకాశం లేదు. ‘మిషన్‌ భగీరథ’ ద్వారా సింగూరు నుంచి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరుతో పాటు మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఏటా మిషన్‌ భగీరథకు 3 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. కాగా, ప్రాజెక్టులో అర టీఎంసీకి నీరు పడిపోవడంతో తాగునీటికి ఆందోళన చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ప్రాజెక్టు నిండడంతో ధీమాతో ఉన్నారు.

పెరిగిన భూగర్బజలాలు..

సింగూర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ పెరగడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగాయని రైతులు తెలిపారు. పక్షం రోజుల క్రితం వరకు ఆపిబోసిన బోరుబావులు.. ఇప్పుడు పైపుల నుంచి ఫుల్‌ ప్రెషర్‌తో నీటిని ఎత్తి పోస్తున్నాయి. సముద్ర మట్టానికి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల సాగు భూములు 510 మీటర్ల ఎత్తులో ఉంటే, ప్రాజెక్టులో నీరు ప్రస్తుతం 521 మీటర్ల నీటిమట్టంలో ఉంది. దీంతో ప్రాజెక్టు ఎగువ,దిగువ పరీవాహాక ప్రాంతాల్లో నీటి ఊటలు పెరిగి బోరుబావుల్లో నీరు పైపైకి ఉబికి వస్తున్నది. రెండేళ్ల తర్వాత ప్రాజెక్టులోకి వరదలు రావడంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు.

ఇన్‌ఫ్లో ఇలా..

వర్షాకాలం ప్రారంభం నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగగా.. సెప్టెంబర్‌ మొదటి వారం వరకు సింగూరు ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీరు చేరింది.ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురియడంతో  సెప్టెంబర్‌ 16 నుంచి భారీ ఇన్‌ఫ్లోలు మొదలయ్యాయి. 16న 15,074 క్యూసెక్కులు, 17న (45,282), 18న (27,990), 19న (30,675)  , 20న (19,032), 21న (15,350), 22న (12,666) 23న 8,245  , 24న (6,138) క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది.  


logo