ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 29, 2020 , 02:12:16

అవినీతి ఎంపీవోపై చర్యలు తీసుకోవాలి

అవినీతి ఎంపీవోపై చర్యలు తీసుకోవాలి

  • ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి

మద్దూరు  పల్లె ప్రకృతి వనం మొక్కల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మండల పంచాయతీ అధికారి శ్రీనివాసవర్మపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ విలేకరులతో మాట్లాడారు. ఎంపీవో ఈజీఎస్‌ ఈసీ పరశురాములు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఇక్కడి నర్సరీల నుంచి కాకుండా ఆంధ్ర నుంచి మొక్కలను తెప్పించారని ఆరోపించారు. రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపుతున్నారని ప్రశ్నిస్తే  పొంతనలేని సమాధానం చెబుతున్నారని తెలిపారు. బ్లీచింగ్‌ పౌడర్‌, శానిటైజర్ల కొనుగోళ్లలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీలలో నిబంధనలకు విరుద్ధంగా కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు.  మండలానికి ఎంపీడీవో ఎవరు వచ్చినా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వారి స్థానంలో ఇన్‌చార్జి ఎంపీడీవోగా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీవో అండదండలతో 11 ఏండ్లుగా ఎంపీవో పలు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన మరుసటి రోజే డీపీవో అండదండలతో ఎంపీవో జగదేవ్‌పూర్‌ మండలానికి డిప్యూటేషన్‌ వేయించుకున్నారని పేర్కొన్నారు. ఎంపీవో అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ వివరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ మేక సంతోశ్‌కుమార్‌, సర్పంచ్‌లు కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి, వంగ బాల్‌రెడ్డి, నాంపల్లి సవితాచంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.


logo