ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 29, 2020 , 02:12:18

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహిళా సంఘాల అభివృద్ధికి  ప్రభుత్వం కృషి

l శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన  ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

మనోహరాబాద్‌ : ప్రతి సంవత్సరం దసరా పండుగకు ఆడపడుచుల పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ సర్కారు సారెను అందజేస్తున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో మహిళలకు బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందన్నారు. చీరెలను పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడు ఆడబిడ్డల దీవెనలు ఉంటాయన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ పండుగను నిడారంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ నర్సింహారెడ్డి, ఎంపీడీవో నవీన్‌కుమార్‌, ఎంపీటీసీ లక్ష్మి, సర్పంచ్‌లు పార్వతీసత్యం, పూల అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆసరాగా పింఛన్లు...

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఎంతో ఆసరాగా అవుతున్నాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్‌ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు సోమవారం పింఛన్‌ ప్రొసీడింగ్‌లను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్యం, పింఛన్లతో వృద్ధులు ఎవరిపై ఆధార పడకుండా జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వృద్ధులకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, వారికి అవసరమైన వైద్య చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య దూరం..

చేగుంట  మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య దూరమైందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.  సోమవారం చేగుంటలోని మురికి కాలువల నిర్మాణం, 105 మంది హమాలీలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి, వడియారం, రెడ్డిపల్లి, రెడ్డిపల్లి కాలనీలో మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి, పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే   భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్‌లు వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, కాశగొని లక్ష్మీజ్ఞానేశ్వర్‌గౌడ్‌, ఎంపీటీసీలు అయిత వెంకటలక్ష్మి, బక్కి లక్ష్మీరమేశ్‌, శంబుని రవి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ తీగుల్ల ఆంజనేయులు, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


logo