ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 29, 2020 , 02:12:18

బీడీ కార్మికుల జీవితాల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు వెలుగులు

బీడీ కార్మికుల జీవితాల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు వెలుగులు

  • n పుర్రె, తేలు గుర్తుతో కాంగ్రెస్‌, జీఎస్టీతో బీజేపీ దెబ్బ
  • n టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే బీడీ కార్మికులకు సరైన ఆదరణ
  • n రాష్ట్రంలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో  బీడీ పింఛన్లు
  • n జిల్లాలో 36,464 మంది బీడీ కార్మికులకు పెన్షన్లు

దుబ్బాక : పొగ చూరిన బీడీ కార్మికుల జీవితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెలుగులు నింపింది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పుర్రె, తేలు గుర్తులను పెట్టి  బీడీ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తే, బీజేపీ ప్రభుత్వం జీఎస్టీతో బీడీ కార్మికులను మరో దెబ్బ తీసింది. కేంద్ర ప్రభుత్వాల వైఖరితో దేశంలో చాలా మంది బీడీ కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడగా, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ బీడీ కార్మికులకు అండగా నిలిచి ‘ఆసరా’ పింఛన్లు మంజూరు చేశారు. 

బీడీ పరిశ్రమల్లో లక్షలాది మందికి ఉపాధి

తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలపై లక్షలాది మంది ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా బీడీలు చుట్టి ఉపాధి పొందే వారున్నారు. బీడీలు చుట్టే వారిలో అధికంగా మహిళలే ఉన్నారు. బీడీ పరిశ్రమలను నమ్ముకుని సుమారు 5లక్షల మందికి పైగా కార్మికులున్నారు. ఇందులో పాత జిల్లాలైన మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బీడీ కార్మికులుంటారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబాల్లో సైతం చాలా మంది మహిళలు బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్నారు. దుబ్బాకలో 60 శాతంపైగా కుటుంబాలు బీడీలు చూడుతుండగా, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో బీడీ కార్ఖానాలున్నాయి. దేశాయి బ్రదర్స్‌, ఠాకూర్‌, సౌదేకార్‌, భాషా, బాలాజీ, శివాజీ కంపెనీలతో పాటు మరిన్ని లోకల్‌ కంపెనీల ద్వారా ఉపాధి పొందుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 128 గ్రామ పంచాయతీల్లో బీడీ కార్ఖానాలున్నాయి. ఒక బీడీ కార్ఖానాలో మునీమ్‌తో పాటు  50 నుంచి వంద మంది కార్మికులుంటారు.

బీడీ కార్మికులకు అండగా కేసీఆర్‌ సర్కారు..

కాంగ్రెస్‌, బీజేపీ కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీడీ కార్మికులు రోడ్డున పడ్డారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షాలతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కేసీఆర్‌ సర్కారు వారికి అండగా నిలిచింది. వారికి జీవనభృతి కల్పించేందుకు ఆరేండ్లుగా ఆసరా పింఛన్లు అందజేస్తూనే ఉంది. మొదట రూ.వెయ్యి ఉన్న పింఛన్‌ మొత్తాన్ని ప్రస్తుతం రూ.2016కు పెంచి ఇస్తున్నది. నెలనెలా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతల్లో జమ చేస్తున్నారు.  పీఎఫ్‌ ఉన్న బీడీ కార్మికులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయడంతో పాటు పింఛన్‌ సొమ్మును రూ.వెయ్యి నుంచి రూ.2016 పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు బీడీ కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

జిల్లాలో 36,464మంది బీడీ కార్మికులకు పింఛన్లు..

దుబ్బాక అంటేనే బీడీ పరిశ్రమలకు పెట్టింది పేరు. రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధికంగా బీడీ కార్మికులున్నారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా ఆసరా పింఛన్‌ లబ్ధిదారులున్నారు. సిద్దిపేట జిల్లా మొత్తంలో 60 వేల మంది బీడీ కార్మికులున్నారు. ఇందులో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 25 వేల మంది ఉండటం గమనార్హం. కేసీఆర్‌ సర్కారు అందిస్తున్న ‘ఆసరా’ పథకంలో దుబ్బాక నియోజకవర్గంలో 70 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఇందులో 50,906 మంది వృద్ధాప్య, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు పింఛన్‌ పొందుతున్నారు. మిగిలిన 20వేల మంది బీడీ కార్మికులు ఆసరా పథకం ద్వారా జీవనభృతి పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 1,75,913 మందికి వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 46,264 మంది బీడీ కార్మికులు ఆసరా పింఛన్‌ పొందుతున్నారు. జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధికంగా 20,274 మంది బీడి కార్మికులు ఆసరా పింఛన్‌ అందుకుంటున్నారు. 

పింఛన్‌.. ఆసరా అయ్యింది..

బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ సర్కారు ఇస్తున్న పించిన్‌ మాకు ఆసరా అయ్యింది. ఇంతకు మునుపు ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలె. నాకు ఆరేండ్ల సంది పించిన్‌ వస్తాంది. పించిన్‌తో కుటుంబాన్ని పోషిస్తున్న. బీడీలు చుట్టిన పైసలను జమ చేస్తున్న. మాకు పించిన్‌ రాకపోతే కష్టంగా ఉండేది. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నమంటే, సీఎం కేసీఆర్‌ సారే కారణం.

- సామల రమ్య, బీడీ కార్మికురాలు, దుబ్బాక

టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు రుణపడి ఉంటాం.. 

మా కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పింఛన్‌ ఇస్తుండు. పింఛన్‌ డబ్బులు రూ.2016కు పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం. నేను 20ఏండ్ల సంది బీడీలు చుడుతున్న. సీఎం కేసీఆర్‌ సహకారంతోనే మా బీడీ కార్మికులకు సరైనా న్యాయం జరిగింది.  

-బోగ జ్యోతి, బీడీ కార్మికురాలు, దుబ్బాక


logo