మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Sep 27, 2020 , 02:13:51

మెదక్‌ జిల్లాలో 56.7 మి.మీటర్ల వర్షపాతం

మెదక్‌ జిల్లాలో 56.7 మి.మీటర్ల వర్షపాతం

మెదక్‌ : జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంజీరా నది జలకళను సంతరించుకుంది. ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో, పొంగిపొర్లుతూ ఏడుపాయల వనదుర్గాభవానీ గుడి ముందు నుంచి పాయలుగా చీలి ప్రవహిస్తోంది. అటు పసుపులేరు(హల్దీవాగు) ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన వెల్దుర్తి, తూప్రాన్‌, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో భారీగా కురిసిన వర్షాలతో హల్దీవాగు జలకళను సంతరించుకుంది.  

పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు...

పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. పర్యాటకులు తరలివస్తున్నారు. సందర్శకులు ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రత పెంచారు. రాయిన్‌పల్లి, కొంటూరు చెరువులతో పాటు దాదాపు అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి.

మెదక్‌ జిల్లాలో 56.7 మి.మీటర్ల వర్షపాతం..

మెదక్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు సరాసరి 56.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేగోడ్‌లో 82.3 మి.మీటర్లు, అత్యల్పంగా మెదక్‌లో 36.1 మి.మీటర్ల వర్షం కురిసింది. పెద్దశంకరంపేటలో 82.3 మీ.మీ, శివ్వంపేటలో 79.9 మి.మీ, నర్సాపూర్‌లో 77.0 మి.మీ, చేగుంటలో 74.8 మి.మీ, చిన్నశంకరంపేటలో 7.17 మి.మీ, కొల్చారంలో 61.5 మి, మీ, తూప్రాన్‌లో 58.0 మి,మీ, మనోహరాబాద్‌లో 52.8 మి.మీ, టేక్మాల్‌లో 57.2 మి,మీ వెల్దుర్తిలో 54.8 మి,మీ వర్షపాతం నమోదైంది.


logo