ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 27, 2020 , 02:13:53

నియంత్రిత సాగును అనుసరించిన అన్నదాతలు

నియంత్రిత సాగును  అనుసరించిన అన్నదాతలు

  • n సిద్దిపేట జిల్లాలో 2.40లక్షల ఎకరాల్లో పత్తి సాగు
  • n 19 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
  • n 24 కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల్లో  సీసీఐ కేంద్రాలు
  • n రైతుకు గిట్టుబాటు కోసం సర్కారు ముందస్తు మార్కెటింగ్‌ ఏర్పాట్లు
  • n ఈసారి పది రోజుల ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

గజ్వేల్‌ : మరికొన్ని రోజుల్లో పత్తి పంట చేతికి రానుండడంతో రైతుకు మద్దతు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ముందస్తుగా మార్కెటింగ్‌ సౌకర్యాలపై దృష్టిపెట్టింది. జిల్లా రైతాంగం నియంత్రిత సాగుకు జైకొట్టింది. రైతులు 2.40లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయగా.. 19లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తికి మద్దతు ధర అందించాలన్న లక్ష్యంతో ముందుగానే ‘కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)’ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మార్కెటింగ్‌ అదనపు ఖర్చులను రైతుకు తగ్గించడానికి, మార్కెట్‌ యార్డుల్లో కాకుండా జిన్నింగ్‌ మిల్లుల్లోనే కొనుగోళ్లను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సిద్దిపేట జిల్లాలోని 24 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు నిర్వహించాలని, ప్రాంతాల వారీగా నవంబర్‌ మొదటి వారం నుంచి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి...

సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో 2.40లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది 1.95 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. సుమారు 16లక్షల క్వింటాళ్ల పత్తి క్రయ విక్రయాలు జరిగాయి. ఇందులో 12 లక్షల క్వింటాళ్లు సీసీఐ, 4లక్షల క్వింటాళ్లు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈసారి అదనంగా 55వేల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది కంటే అదనంగా 19లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది క్వింటాలుకు మద్దతు ధర రూ.5,550 ఉండగా.. ఈసారి రూ. 5825గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి కూడా రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలపైనే ఆధారపడవచ్చని భావించి, ఇందుకోసం ప్రభుత్వం ముందస్తుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

24 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు...

గతేడాది నవంబర్‌ 15తర్వాత జిల్లాలో పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి నవంబర్‌ మొదటి వారం నుంచే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకరాకు సరాసరి దిగుబడి 8 క్వింటాళ్లు వస్తుందని అంచనా. కాగా, అందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 24 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు గతేడాది మాదిరిగానే నిర్వహించనున్నారు. గతేడాది మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ధర నిర్ణయం, తూకం పూర్తయినా, తిరిగి జిన్నింగ్‌ మిల్లుల్లో పంటను ఖాళీ చేశారు. మార్కెట్‌కు తీసుకుపోవడానికి అయ్యే అదనపు రవాణా భారాన్ని రైతుకు తగ్గించాలని ఈ సారి మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ కొనుగోళ్లను నిలిపి వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

మద్దతు అందించడం కోసం.. 

పత్తి రైతుకు మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలో వానకాలంలో ఏ గ్రామానికి చెందిన రైతు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశాడో ముందుగానే క్షేత్రస్థాయిలో సర్వే చేసి వ్యవసాయశాఖ అధికారులు వివరాలను సేకరించారు. వాటిని కంప్యూటరీకరణ చేశారు. సదరు రైతు నుంచి ముందుగా సేకరించిన వివరాల ప్రకారం పత్తిని కొనుగోలు చేయనున్నారు. ఆన్‌లైన్‌ వివరాల ప్రకారం ఏ మిల్లుకు వెళ్లినా, ఆ రైతు పత్తిని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవచ్చు. డబ్బులు రైతు ఖాతాలో జమవుతాయి. సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత సాగు జిల్లాలో అమలైంది. మొక్కజొన్నకు దాదాపు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. పత్తి , వరి సాగు విస్తీర్ణం పెరిగింది. అందుకు అనుగుణంగా రైతుకు మార్కెటింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.

పత్తి ఉత్పత్తి, క్రయవిక్రయాల్లో గజ్వేల్‌ కీలకం... 

సిద్దిపేట జిల్లాలో పత్తి ఉత్పత్తిలో గజ్వేల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ మండలాల్లో అత్యధిక దిగుబడులు సాధించడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను ఇక్కడి రైతులు సాధిస్తున్నారు. సమగ్రమైన సస్యరక్షణ అనుభవంతో కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. మెట్ట పొలాల్లో సైతం 16 నుంచి 18 క్వింటాళ్లు సాధించిన వారు ఉన్నారు. ఈసారి వర్షాలు అధికంగా కురవడంతో నల్లరేగడి భూముల్లో పత్తి పంట కాస్త దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. అయినా ఇప్పటి అంచనా ప్రకారం జిల్లాలో సరాసరి దిగుబడి ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్లు చేతికందవచ్చని భావిస్తుండగా, గజ్వేల్‌ డివిజన్‌లో అధికంగానే ఉంటుందని అంచనా. గజ్వేల్‌ కేంద్రంగా ఏటా పత్తి కొనుగోలు భారీగా జరుగుతున్నది. గుంటూరు, రాజస్థాన్‌, పెద్దపల్లి, వరంగల్‌, విజయవాడ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు పత్తి ఎగుమతులు చేస్తున్నారు. స్థానికంగా జిన్నింగ్‌ మిల్లులు ఏర్పడడంతో ఇతర ప్రాంతాలకు సరఫరా తగ్గింది. గజ్వేల్‌ ఏరియాలో 15 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి.

బీటీ విత్తనాల వాడకమే అధికం...

పత్తిసాగులో రైతులు అధికంగా బీటీ విత్తనాలే వాడుతున్నారు. వర్షాధారంగా సాగయ్యే పత్తి ప్రధాన పంటగా మారింది. గజ్వేల్‌తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పండించిన పత్తి మంచి నాణ్యత ఉండడంతో మార్కెట్‌లో అమ్మకాలు బాగుంటున్నాయి. గతేడాది గజ్వేల్‌, తదితర ప్రాంతాల్లో పండిన పత్తి 32ఎంఎం స్టేబుల్‌ ఉన్నట్లు మార్కెటింగ్‌ వర్గాలు గుర్తించాయి. దీంతో జిల్లాలో సీసీఐతో పాటు ప్రైవేటు వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.  


logo