మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Sep 25, 2020 , 02:28:47

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

రైతులకు ఇబ్బందులు  కలగకుండా చూడాలి

  • సమీక్షలో మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

మెదక్‌ :  ధాన్యం కొనుగోలు సమయంలో పంట పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సివిల్‌ సప్లయ్‌, రెవెన్యూ, రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా వర్షాలు  కురిశాయని ఎంత పంట దిగుబడి వస్తుందో అధికారులు అంచనా వేసి  చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో ఎంత విస్తీర్ణంలో పంట పండించారనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారని, దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.   అనుకున్న సమయంలో ధాన్యం సేకరణ, బియ్యం డెలవరీలు పూర్తయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌  ఆదేశించారు.  సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌, సహాయ అధికారి రాజునాయక్‌, మెదక్‌, తూప్రాన్‌ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, వీఆర్వోలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి..

మెదక్‌ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్‌ ప్రాంతం, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం వద్ద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌తో కలిసి వార్డుల్లో పర్యటించారు.   తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలన్నారు. రోడ్డు పక్కన ఉన్న నాలాలను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.

‘మన పంచాయతీ శీర్షిక’ సిద్ధంగా ఉండాలి..

 జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మన పంచాయతీ శీర్షికలను వారం రోజుల్లోగా సిద్ధం చేసుకోవాలని ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మెదక్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని, సాయంత్రం మరోసారి గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవసరమైన సేవలందించాలన్నారు. వారం రోజుల్లో మన పంచాయతీ శీర్షిక పుస్తకాన్ని పంచాయతీ కార్యదర్శులు రూపొందించుకోవాలన్నారు. ఈ పుస్తకంలో ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ జనాభా, విస్తీర్ణం, చెరువులు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, పంచాయతీ కార్మికులు, ట్రాక్టర్‌ మెయింటెనెన్స్‌, పింఛన్లు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, హరితహారం, సెగ్రిగేషన్‌ షెడ్ల వివరాలు, వైకుంఠధామాలు, రైతుల సమాచారం వంటి వివరాలను పొందుపర్చాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, ఆయా శాఖల అధికారులు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.logo