గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Sep 25, 2020 , 02:27:35

పశువులకు బీమా రైతన్నకు ధీమా

పశువులకు బీమా రైతన్నకు ధీమా

  • l 80 శాతం ప్రీమియం భరించనున్న ప్రభుత్వం
  • l 20 శాతం రైతులు చెల్లించాలి
  • l అక్టోబర్‌ 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం
  • l మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు
  • l మెదక్‌ జిల్లాలో 1,32,512 పాడి గేదెలు 

మెదక్‌ : విద్యుత్‌ షాక్‌, వాహనాలు ఢీకొని, పిడుగుపాటు తదితర ప్రమాదాల్లో పశువులు మృత్యువాత పడుతుండడంతో పెంపకందారులకు నష్టం వాటిళ్లుతున్నది. పశువులు మృతి చెందిన తర్వాత రైతుకు నష్ట పరిహారం అందాలంటే ఏండ్లు పడుతున్నది. దీంతో రైతును ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. పశువులు ప్రమాదాల్లో మృతి చెందితే బీమా పరిహారం కింద పశువులకు బదులు పశువులను కొనుగోలు చేసి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం పాడి పశువుల బీమాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 

80 శాతం ప్రీమియం భరించి.. 

పశువులకు బీమా కింద రైతులు గతంలో 50 శాతం ప్రీమియం చెల్లించేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం 80 శాతం బీమా ప్రీమియాన్ని భరిస్తుండడంతో రైతులు 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. బీమా ప్రీమియం చెల్లించిన 15 రోజుల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. బీమా చేయించిన ప్రతి పశువుకు ట్యాగ్‌ వేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, పాముకాటు, విద్యుత్‌ షాక్‌తో పాటు ఇతర వ్యాధులతో పశువు చనిపోయినా బీమా పరిహారం అందుతుంది. 

మెదక్‌ జిల్లాలో 69,140 పశువులు..

మెదక్‌ జిల్లాలోని 20 మండలాల్లో 69,140 పశువులు ఉండగా, 1,32,512 పాడిగేదెలు  ఉన్నాయి. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతోంది. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పశువైద్యాధికారులు పర్యటిస్తూ, పశువులకు రోగాలు రాకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే పశువులకు లాంపిస్కిన్‌ అనే వ్యాధితో పశువులు అస్వస్థతకు గురవుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన పశువుల చర్మంపై పుండ్లు ఏర్పడడం, చర్మం ముద్దగా మారుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పశువైద్యాధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పశువులకు చికిత్సలు అందజేస్తున్నారు.

అక్టోబర్‌ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

అక్టోబర్‌ 15వ తేదీ నుంచి జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో రైతులు దరఖాస్తులు చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రైతు ఆధార్‌ కార్డుకు అనుసంధానంగా పశువులకు బీమా చేయనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా పశువైద్యాధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


logo