శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Sep 24, 2020 , 01:39:15

సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

  •  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ విజ్ఞప్తి 

పుల్కల్‌ : సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో  రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న ఏకైక భారీ నీటిపారుదల ప్రాజెక్టు సింగూరు అని, ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రతిరోజూ వేలాది పర్యాటకులు వస్తారని తెలిపారు. రెండేండ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తిగా నిండిందని, దీంతో పర్యాటకుల రద్దీ పెరగడంతో అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న్డారని మంత్రికి వివరించారు. పర్యాటకుల వాహనాలు కిలో మీటర్ల మేర క్యూలైన్‌లో ఉంటాయని, వాహనాలను పార్కింగ్‌ చేయడానికి చదును చేసిన స్థలం కూడా లేదన్నారు. ప్రాజెక్టు జంట నగరాలకు సమీపంలో ఉండటంతో నిత్యం వేలాది మంది పర్యాటకులు సింగూర్‌కు వస్తుంటారని, వీరికి కనీసం అధునాతన బోట్‌ సౌకర్యం కూడా లేదని తెలిపారు. ప్రాజెక్టుకు మూడు అధునాతన కొత్త బోట్లు మంజూరు చేయాలని కోరారు. ఇమ్యూజియం పార్కులు, చిన్నారుల ఆటపాటల కోసం ప్రత్యేక టూల్స్‌, విశాలమైన రెస్టారెంట్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అందోల్‌ నియోజకవర్గం యువకుల కోసం క్రికెట్‌ స్టేడియాలు, జిమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందిస్తూ సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి నిపుణులతో అధ్యయనం చేయిస్తానని తెలిపారు. 


logo