శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Sep 23, 2020 , 01:57:21

కొత్త రెవెన్యూ చట్టంపై అన్నదాత సంబురం

కొత్త రెవెన్యూ చట్టంపై అన్నదాత సంబురం

  • n సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీగా ట్రాక్టర్ల ర్యాలీలు
  • n గ్రామాల నుంచి వాహనాలతో రోడ్లపై వచ్చిన రైతులు
  • n ర్యాలీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఉమ్మడి జిల్లాలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. మెదక్‌లో 500 ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ట్రాక్టర్లు నడిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో సుమారు 500 ట్రాక్టర్లతో తీసిన భారీ ర్యాలీని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ ప్రారంభించారు. గజ్వేల్‌లో రైతులు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ తీయగా, ఎఫ్‌డీసీ చైర్మన్‌ హాజరయ్యారు. కొండపాక ర్యాలీలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మెదక్‌లో 500 ట్రాక్టర్లతో ర్యాలీ..

మెదక్‌: వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. మెదక్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ముందుగా ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నడిపించారు. ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కొత్త బస్టాండ్‌, పోలీస్‌స్టేషన్‌, చిల్డ్రన్స్‌ పార్కు, రాందాస్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ల మీదుగా ఆటోనగర్‌, కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, హవేళిఘనపూర్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంజాగౌడ్‌, హవేళిఘనపూర్‌ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మెదక్‌ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భూ సమస్యలు లేకుండా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా కాలంలోనూ పథకాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నిరంతరం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు బంధు, రైతుబీమా పథకాలతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ చట్టంలో రెవెన్యూ కోర్టులు, ఆర్డీవో కోర్టులు, తహసీల్‌ కోర్టులు ఉంటాయని, వీటిని సవరణ చేసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు పట్టాలు ఉన్నా ఆర్వోఆర్‌లు మాత్రమే ఉన్నాయని, అదే భూమిలో రైతులు దున్నుకునేలా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందన్నారు. వారసత్వ హక్కులను కూడా ఈ చట్టంలో పొందుపర్చారన్నారు.   

భూ తగాదాలు లేకుండా చట్టం... - ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, 

సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం అన్నదాతల అదృష్టమన్నారు. భూముల విలువ పెరుగుతున్న తరుణంలో ఇది మంచి నిర్ణయమన్నారు. ఈ కొత్త చట్టంలో వారసత్వంగా వచ్చే భూములు వారికే చెందుతాయన్నారు. ఎన్నో ఏండ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. గతంలో రైతుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తహసీల్‌ కార్యాలయం చుట్టూ తిరిగేవారని, నెలలు గడుస్తున్నా వారి సమస్య పరిష్కారం కాకపోయేదన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ వారసత్వ భూములు వెంటనే వారికి అమలయ్యేలా ఈ చట్టం తీసుకొచ్చారన్నారు.

కొత్త చట్టంతో సమూల మార్పులు

కొండపాక: సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టంతో సమూల మార్పులకు శ్రీకారం  చుట్టారని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా మండలంలోని ఆయా గ్రామాల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి బయలుదేరిన ట్రాక్టర్లు కుకునూర్‌పల్లి నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌కు వెళ్లాయి. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీలో డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి అవినీతికి ఆస్కారం లేని రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ర్యాలీలో రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీ రవీందర్‌, మండల కన్వీనర్‌ ర్యాగళ్ల దుర్గయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు చిట్టి మాధురి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు చింతల సాయిబాబా, రాష్ట్ర రైతు సలహా కమిటీ సభ్యురాలు అనంతుల పద్మానరేందర్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయ సంస్కరణలకే..

గజ్వేల్‌/గజ్వేల్‌ అర్బన్‌: రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు విజయవంతంగా అమలవుతున్నాయని, రైతులు కోరుకున్న విధంగా ప్రభుత్వం పరిపాలనను అందిస్తున్నదని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజ్ఞాపూర్‌ హరిత రెస్టారెంట్‌ నుంచి సమీకృత మార్కెట్‌ చౌరస్తా వరకు రెవెన్యూ సంస్కరణలకు మద్దతుగా రైతులు భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద రైతులనుద్దేశించి ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. 73ఏండ్లుగా ములుగుతున్న రైతు సమస్యలకు సీఎం కేసీఆర్‌ పరిష్కారం చూపారని, భూరికార్డులు, హక్కుల కోసం రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి పంచాయతీలు, దండుగల పాలైన రైతులకు కొత్త రెవెన్యూ చట్టం బాసటగా నిలుస్తుందన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదని, చిన్న, సన్నకారు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు మీటర్ల బిగింపు, స్వేచ్ఛ మార్కెట్‌ విధానం అమలుకు ప్రయత్నాలను మానుకోవాలన్నారు.

దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలుస్తాం..

దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష మెజార్టీతో గెలుపొందుతుందని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా దేశంలో గుర్తింపు పొందిందని రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగనాగిరెడ్డి అన్నారు. వ్యవసాయ సంస్కరలతో సాగు విస్తీర్ణం, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవి రవీందర్‌ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని రూపుమాపడానికే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు కేంద్రం అమలు చేసే మీటర్ల బిగింపును ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం, అనంతుల పద్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

తెలంగాణలో నవశకం

చిన్నకోడూరు: రైతులు సంబురపడేలా కొత్త రెవెన్యూ చట్టానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేసి తెలంగాణలో నవశకానికి పునాది వేశారని సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా చిన్నకోడూరులో సుమారు 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ర్యాలీని ప్రారంభించిన జడ్పీ అధ్యక్షురాలు, ట్రాక్టర్‌ నడిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్‌, రైతుల భూములతోపాటు యాజమాన్య హక్కును కాపాడడానికి అద్భుతమైన చట్టాన్ని అమలు చేస్తున్నారన్నారు. నూతన రెవెన్యూ చట్టం రైతులకు కొండంత భరోసా ఇస్తున్నదని తెలిపారు. రైతుల భూసమస్యలను పరిష్కరించేలా రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, వైస్‌ ఎంపీపీ పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

లంచాలిస్తేనే వారసత్వ పట్టాలు..

వారసత్వ భూములు పట్టాలు కావాలంటే వీఆర్వోలకు లంచాలు ఇవ్వాలిందే. లేదంటే ఏండ్ల తరబడి తిరుగాల్సి వచ్చేది. తిరిగి తిరిగి విరక్తి చెందిన తర్వాత వీఆర్వోకు డబ్బులిస్తే పని అవుతుందని వాళ్లు..వీళ్లు చెబితే తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంతటి అక్రమాలకు పాల్పడే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. - సత్యం బాచారం, పాపన్నపేట మండలం

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం..

రెవెన్యూ వ్యవస్థలో భారీ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పటికీ అవగాహన రాహిత్యం, నిర్లక్ష్యంతో చాలా గ్రామాల్లో ఎన్నో తప్పిదాలు చేసిన్రు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిండు.

- శ్రీనివాస్‌ యువ రైతు నాగపూర్‌ logo