ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Sep 21, 2020 , 00:02:14

బీజేపీకి క్యాడర్‌ లేదు... కాంగ్రెస్‌కు లీడర్‌ లేడు

బీజేపీకి క్యాడర్‌ లేదు... కాంగ్రెస్‌కు లీడర్‌ లేడు

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్రను తిరగ రాస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తాను చూపిస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీది సోషల్‌మీడియాలో హడావిడే తప్పా గల్లీలో ఏమి లేదన్నారు. క్యాడర్‌ లేని బీజేపీ, లీడర్‌ లేని కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌కు ఎంతమాత్రం పోటీలేదని ఎద్దేవా చేశారు.సీఎం కేసీఆర్‌ రైతులతో పాటు అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారన్నారు. -దుబ్బాక టౌన్‌

దుబ్బాక టౌన్‌ :  క్యాడర్‌ లేని బీజేపీ, లీడర్‌ లేని కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌కు  పోటే కాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌, బీజేపీలు డిపాజిట్‌ను దక్కించుకొని రెండోస్థానం కోసం పోటీపడుతున్నాయన్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ చరిత్రను తిరుగరాస్తుందని మంత్రి అన్నారు. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లా తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు తప్పా మరో పార్టీకి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేట, వెంకటగిరితండా, గంభీర్‌పూర్‌, శిలాజీనగర్‌, పెద్ద చీకోడ్‌ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద చీకోడ్‌లో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ఆదుకోని విధంగా తెలంగాణలో రైతులను రైతుబంధు, రైతుబీమాతో సీఎం కేసీఆర్‌ ఆదుకుంటున్నారన్నారు. ఇంతంటి కష్టకాలంలోనూ  రూ.7వేల250 కోట్ల రైతుబంధు అందజేశామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 77వేల మందికి రైతుబంధు ఇచ్చామని మంత్రి తెలిపారు. 

బీజేపీకి మంత్రి ప్రశ్నల వర్షం..

బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ప్రభుత్వం రైతులకు ఏమి ఒరగబెట్టిందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ బోరు మోటర్ల వద్ద, బాయిల వద్ద మీటర్లు బిగించే ఏర్పాటుకు పూనుకుంటుందన్నారు. కాగా, మీటర్లు పెట్టే విధానాన్ని సీఎం కేసీఆర్‌ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. మక్కలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే, ఇక్కడ పండిన మక్కలు ఏమి కావాలి అని కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.  

కష్టకాలంలోనూ సంక్షేమం..

ఇంతంటి  కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించిందన్నారు. ప్రతి ఏడాది రూ. 11వేల 700ల కోట్లు ఆసరా పింఛన్లకు అందిస్తున్నదన్నారు. అందులో కేంద్రం వాటా కేవలం రూ.210 కోట్లు మాత్రమేనన్నారు.  దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నదని, బీజేపీకి గుణపాఠం చెప్పే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందన్నారు. యువత, విద్యార్థులు, మేధావులు గడప గడపకు వెళ్లి కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. 

  రూ.17 కోట్ల మహిళా రుణాలు అందజేత.. 

దుబ్బాకలో ఆదివారం మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంలోని 546 మహిళా గ్రూపులకు రూ.17 కోట్ల 48 లక్షల చెక్కులు అందజేశారు. స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు రుణాలను అందజేశారు. అంతకుముందు పోతారెడ్డిపేటలో రూ. 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణ పనులు, వర్మి కంపోస్టు ఎరువుల తయారీని, వెంకటగిరి తండాలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. శిలాజీనగర్‌, నర్లేంగ గడ్డ, పద్మశాలీ గడ్డ గ్రామస్తులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని మంత్రికి అందజేశారు.

శంకుస్థాపనలు.. చేరికలు..

 గంభీర్‌పూర్‌, హబ్షిపూర్‌, తిమ్మాపూర్‌లో గ్రామీణ కూరగాయల మార్కెట్‌, పెద్ద చీకోడ్‌లో రైతువేదిక నిర్మాణాలకు  శంకుస్థాపన చేసి  ఓపెన్‌ జిమ్‌ను మంత్రి ప్రారంభించారు. వెంకటగిరితండా, పెద్ద చీకోడ్‌లో  భారీగా యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమాల్లో జట్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత, ఏఎంసీ చైర్మన్‌ బండి శ్రీలేఖ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, సర్పంచ్‌లు తౌడ శ్రీనివాస్‌, భాస్కర్‌, డీఆర్‌డీవో పీడీ గోపాల్‌రావు పాల్గొన్నారు.


logo