గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Sep 19, 2020 , 02:21:18

కొల్లూరులో.. డబుల్‌ సందడి

కొల్లూరులో.. డబుల్‌ సందడి

  • n డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని పరిశీలించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి
  • n వెనక్కి తగ్గిన కాంగ్రెస్‌ నాయకులు
  • n ఇది ఓ అద్భుత కళాఖండమని మంత్రుల కితాబు
  • n 10 శాతం స్థానికులు, 90 శాతం నగర పేదలకు ఇండ్లు
  • n రాజకీయాలకు తావులేకుండా  పారదర్శకంగా  కేటాయింపు : మంత్రులు 
  • n కాంగ్రెస్‌ కట్టించిన ఇండ్లను ఇప్పటికీ ఎవరూ తీసుకోలదని మంత్రుల విమర్శ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయం వద్ద సందడి నెలకొన్నది. శుక్రవారం రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా సిబ్బందితో సందడిగా కనిపించింది. ఇండ్ల పరిశీలనకు మంత్రులతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారనే సమాచారంతో ఈ సందడి నెలకొన్నది. చివరకు కాంగ్రెస్‌ నేతలు రాకపోవడంతో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఇండ్లను పరిశీలించారు. ఒకేచోట అన్ని వసతులతో 15,560 ఇండ్ల నిర్మాణం చేపట్టడం అద్భుతమని వారు అభివర్ణించారు. ఇండ్లను పరిశీలించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌ శివారులో ఇండ్లు నిర్మిస్తున్నప్పటికీ, అందులో 90 శాతం హైదరాబాద్‌ నగర పేదలకే ఇండ్లు కేటాయించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. మిగతా 10శాతం స్థానికులకు అందిస్తారన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో స్థలం కొరత కారణంగా శివారులో ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. కానీ, నగరంలో వందల ఎకరాల స్థలం ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడడం తగదన్నారు. 30 ఏండ్ల కింద కాంగ్రెస్‌ హయాంలో గ్రేటర్‌ పరిధిలోని 15 శివారు ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు ఎందుకు నిర్మించారని వారు ప్రశ్నించారు. వందల ఎకరాలు నగరంలో ఉంటే, శివారులో అప్పుడు ఆ పుల్లల డబ్బీల ఇండ్లు ఎందుకు కట్టారు..? ఇప్పటికీ వాటిని ఎవరూ తీసుకోలేదని విమర్శించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా ప్రభుత్వం డబుల్‌ ఇండ్లు పేదలకు నిర్మించి ఇస్తున్నదన్నారు. హైదరాబాద్‌ నగర పేదల కోసం గ్రేటర్‌ పరిధిలోని 111 ప్రాంతాల్లో మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఎక్కడ నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకుల ఇండ్లకు, ఇండ్ల లిస్టు పంపిస్తున్నామని, వెళ్లి పరిశీలించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇండ్లు చూస్తే కాంగ్రెస్‌ నాయకులకు కండ్లు తిరుగుతున్నాయని, అందుకే పరిశీలనకు రాకుండా పత్తాలేకుండా పారిపోయారని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతంలో, అధునాతన హంగులతో ప్రభు త్వం పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తాందన్నారు. ఇవేవి పట్టించుకోకుండా, ఎక్కడ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని, కండ్లు లేవా..? కనిపించడం లేవా..? ఇండ్ల వద్దకు వెళ్లి లెక్క పెట్టుకోవాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్‌ పూర్తిగా దివాల తీయడంతోనే, ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, హైదరాబాద్‌ను వాళ్లే ఆగం చేశారని, దోచుకున్నారని, దాచుకున్నారంటూ మంత్రి విమర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో అద్భుతమైన పథకాలు కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నదని స్పష్టం చేశారు. సవాల్‌ను స్వీకరించి స్వయంగా మంత్రులే ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి ఇండ్ల పరిశీలనకు వెళ్లడం, దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో లెక్కల్లో మాత్రం లక్షల ఇండ్లు చూపించారని, కానీ.. అవి ఎక్కడా కనిపించవని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విమర్శించారు. ఇండ్ల నిర్మాణం పేరుతో కాంగ్రెస్‌ నేతలు భారీ స్కాములు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఇండ్లు నిర్మించి, అంతే పద్ధ్దతిగా పేదలకు అందిస్తున్నదని తెలిపారు. కాగా, గురువారం రోజే మంత్రులు, కాంగ్రెస్‌ నేతల కొల్లూరుకు రావాల్సి ఉండగా, కార్యక్రమాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. చివరి క్షణంలో కాంగ్రెస్‌ నాయకులు బట్టి విక్రమార్క, ఇతర నాయకులు ఇక్కడకు రాకుండా మధ్య నుంచే వెళ్లిపోయారు. సమావేశంలో తెల్లాపూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo