శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Sep 17, 2020 , 02:53:21

పనులు.. పరుగు

పనులు.. పరుగు

  • n శరవేగంగా సాగుతున్న  రైతు వేదికల నిర్మాణ పనులు
  • n మెదక్‌ జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో రైతు వేదికలు 
  • n జిల్లాలో ఫస్ట్‌గా పూర్తయిన పాతూర్‌ వేదిక

మెదక్‌ : మెదక్‌ జిల్లావ్యాప్తంగా రైతువేదికల నిర్మాణ పనులు పరుగుపెడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల దాదాపుగా పనులు తుది దశకు చేరాయి. అన్నదాతల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన నుంచి వచ్చిందే ఈ రైతు వేదికల నిర్మాణం. పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, చీడపీడల నివారణ, అధికారుల అభిప్రాయాలు, ఎరువులు ఇలా సమాచారమంతా రైతుకు అన్నీ ఒకే దగ్గర అందాంచాలన్నదే సీఎం కేసీఆర్‌ సదుద్దేశం. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత కరెంటు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, రుణాలు, మద్దతు ధర ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆర్‌ రైతు వేదికలతో అధికారులే రైతుల దగ్గరకు వచ్చి సలహాలు ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను క్లస్టర్‌ కో రైతు వేదికను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత జూన్‌లో మెదక్‌ జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో వేదికల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. 

శరవేగంగా నిర్మాణాలు..

జిల్లావ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి ఐదు వేల ఎకరాలకు 2046 చదరపు అడుగుల్లో వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో రూ.12 లక్షల వరకు వ్యవసాయ శాఖ సమకూర్చుతుండగా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. కొన్ని చోట్ల దాతల సహకారం తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో స్థలాలను గుర్తించి నిర్మాణాలను ప్రారంభించారు. మెదక్‌, హవేళిఘనపూర్‌, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, చిలిపిచెడ్‌, కొల్చారం, నర్సాపూర్‌, చేగుంట, మనోహరాబాద్‌, తూప్రాన్‌, టేక్మాల్‌ మండలాల్లో రైతు వేదికల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల తుది దశకు చేరాయి.

జిల్లాలో తొలివేదిక..

మెదక్‌ జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో ఈ రైతు వేదికలను నిర్మిస్తుండగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ నియోజకవర్గంలోని మెదక్‌ మండలం పాతూర్‌లో రైతు వేదిక నిర్మాణం మొట్టమొదటగా పూర్తయింది. ఇందులో సుమారు 300 మంది రైతులు సమావేశమయ్యేలా హాలు, రైతులు విశ్రాంతి తీసుకునేందుకు రెండు గదులను నిర్మించారు. వేదిక గోడలపై కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు జీవనచిత్రాలను వేయించనున్నారు. ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలను నాటనున్నట్లు అధికారులు తెలిపారు.

20 రోజుల్లో పూర్తి చేస్తాం..

జిల్లావ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మిస్తున్నాం. దసరా వరకు రైతు వేదికలను పూర్తి చేస్తాం. మరో 20 రోజుల్లో ఆయా మండలాల్లో 15 రైతు వేదికలను పూర్తి చేస్తాం. జిల్లాలోని అన్ని చోట్ల స్థల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాం. 

- కె.రామచంద్రారెడ్డి, ఈఈ పీఆర్‌