శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Sep 17, 2020 , 02:52:11

జోరువాన

జోరువాన

  • ఉమ్మడి జిల్లాలో అలుగు పోస్తున్న చెరువులు m పారుతున్న వాగులు

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు బుధవారం ఉమ్మడి మెదక్‌ జిల్లాను ముంచెత్తగా.., వాగులు పారుతున్నాయి, చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పల్లెలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలంలో అత్యధికంగా 108.5 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. కాగా, రామాయంపేట పట్టణంలోని హనుమచెరువు సుమారు 20 ఏండ్ల తర్వాత అలుగు పారుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో పుల్కల్‌ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్ద నిర్మించిన చెక్‌డ్యాం మత్తడి దుంకింది. పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లి చెరువు అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగల్‌గిద్ద మండలంలో కురిసిన వర్షానికి ఎస్గీ-ఔదత్‌పూర్‌ గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన వంతెన తెగిపోయింది. జహీరాబాద్‌ పట్టణంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారి వరద నీటితో మునిగిపోయింది. అలాగే, జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా ప్రవహించే మంజీర నదిలో భారీగా వరద చేరుకున్నది. హుస్నాబాద్‌ డివిజన్‌ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నీటి వనరులు నిండుకుండల్లా మారాయి. హుస్నాబాద్‌ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లెచెరువులు జోరుగా మత్తడి పోస్తున్నాయి.

- రామాయంపేట/ పుల్కల్‌/ పాపన్నపేట/ నాగల్‌గిద్ద/ జహీరాబాద్‌/ న్యాల్‌కల్‌/ హుస్నాబాద్‌

సిద్దిపేట జిల్లాలో 30.8 మి.మీ వర్షపాతం 

సిద్దిపేట రూరల్‌: రెండు, మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం జిల్లాలో సగటున 30.8 మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా బెజ్జంకి మండలంలో 108.5 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా చేర్యాల మండలంలో 0.3 మి.మీ వర్షపాతం నమోదైంది. దుబ్బాకలో 51.6 మి.మీ, సిద్దిపేట రూరల్‌ 74.5 మి.మీ, చిన్నకోడూరు 60.4 మి.మీ, కోహెడ 38.3 మి.మీ, హుస్నాబాద్‌లో 32.0 మి.మీ, అక్కన్నపేట 8.9 మి.మీ, నంగునూరు 0.4 మి.మీ, సిద్దిపేట అర్బన్‌ 63.6 మి.మీ, తొగుట 20.7 మి.మీ, మిరుదొడ్డి 29.5 మి.మీ, దౌల్తాబాద్‌ 48.2 మి.మీ, రాయపోల్‌ 20.4 మి.మీ, వర్గల్‌ 9.8 మి.మీ, ములుగు 9.5 మి.మీ, మర్కూక్‌ 22.8 మి.మీ, జగదేవ్‌పూర్‌ 12.5 మి.మీ, గజ్వేల్‌ 30.7 మి.మీ, కొండపాక 12.8 మి.మీ, కొమురవెల్లి 1.8 మి.మీ, మద్దూరు 1.5 మి.మీ, నారాయణరావుపేట 49.5 మి.మీల వర్షపాతం నమోదైంది.

సింగూరులోకి జలసిరులు

పుల్కల్‌: సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్ర వాహం కొనసాగుతున్నది. పరీవాహక ప్రాం తంలో కురుస్తున్న వర్షాలకు 15,074 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. డ్యాంలో క్యాచ్‌మెంట్‌ ఏరియాలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో పడుతున్న వర్షాలకు వాగు ల ద్వారా మంజీరా నదిలోకి చేరి సింగూరు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. ప్రాజెక్టు నీటి మట్టం 1717 అడుగులకు (29.900 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1691.2 అడుగులకు (4.618) నీరుందని జలవనరులశాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. ఎగువ నుంచి బుధవారం రాత్రి వరకు 15వేల క్యూసెక్కుల నీరు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గురువారం ఉదయం వరకు డ్యాంలోకి ఆరు టీఎంసీల నీరు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.