బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Sep 09, 2020 , 00:59:25

లక్కీ డ్రా ముగిసింది..బహుమతులేవి..?

లక్కీ డ్రా ముగిసింది..బహుమతులేవి..?

  •  n  15 రోజులు గడిచినా బహుమతులు       ఇవ్వని నిర్వాహకులు
  •   n లబోదిబోమంటున్న బాధితులు
  •   n  నిర్వాహకులపై చర్యలు    తీసుకోవాలని డిమాండ్‌

మెదక్‌ :రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు వినటం లేదు. పోలీసులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రజల అత్యాశే వారి కొంప ముంచుతున్నది. స్కీంల పేరుతో లాటరీ నిర్వాహకులు కొందరు అమాయక జనం దగ్గర కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. చివరికి మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. 

జనాలకు కుచ్చుటోపీ...

 జిల్లాలోని పలు మండలాల్లో లక్కీ డ్రా పేరుతో అమాయకుల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇందులో మెదక్‌ పట్టణానికి చెందిన ఒక యూత్‌ లీడర్‌, ఓ ప్రముఖ చిట్‌ఫండ్‌ మేనేజర్‌తో పాటు పలువురు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా కలిసి ఎంటర్‌ప్రైజెస్‌ల పేరుతో లక్కీ స్కీంలు ఏర్పాటు చేశారు. వేలాది మందిని సభ్యులుగా చేర్చుకొని వారిని అడ్డంగా దోచేస్తున్నారు. జిల్లాలో దాదాపు 10 వరకు ఇలాంటి ఎంటర్‌ప్రైజెస్‌లు ఉన్నాయి. ఒక్కో స్కీంలో 3వేల మంది సభ్యులను చేర్చుకుంటూ వారి వద్ద నుంచి నెలకు రూ.1100 కట్టించుకుంటున్నారు. ఇలా 3వేల మంది నుంచి ఒక్కో నెల రూ.30లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఇచ్చే బహుమతుల ధరలు మాత్రం వేలు దాటడం లేదు.

డ్రా ముగిసినా..  ఇప్పటికీ అందని బహుమతులు.. 

జిల్లా కేంద్రంలో సంవత్సరకాలంగా నిర్వహిస్తున్న తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌ స్కీం ఇటీవలే ముగిసింది. ఆగస్టు 25న ఇందుకు సంబంధించి చివరి ‘డ్రా’ కూడా తీశారు. అం దులో లాస్ట్‌ డ్రా తీసే సమయానికి ఎలాంటి బహుమతులు రాని వారికి ఏదో బహుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. కానీ ,  ఇప్పటి వరకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. తిరుమల ఎంట్రర్‌ప్రైజెస్‌ నిర్వాహకులను బాధితులు ఎన్నిసార్లు అడిగినా కనీసం స్పందించడం లేదు. ఏదో ఒక వంకతో కాలయాపన చేస్తూ వస్తున్నారని బాధితులు చెబుతున్నారు. 

ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టిన నిర్వాహకులు..

ఇలాంటి స్కీంలు చట్ట వ్యతిరేకం. లాటరీల పేరుతో జనాన్ని దోచుకునే వారిని పోలీసులు చాలాసార్లు కటకటాల్లోకి నెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి స్కీంలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఎవరైనా ఎంటర్‌ప్రైజెస్‌ తెరువాలనుకుంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నిర్ణీత రుసుం చెల్లించాలి. కానీ, ఇవేమీ నిర్వాహకులు పాటించడం లేదు. కేవలం జనాన్ని బహుమతుల ఆశ చూపి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. logo