మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Sep 06, 2020 , 02:35:53

రైతు వేదిక పనులు వేగవంతం చేయాలి

రైతు వేదిక పనులు వేగవంతం చేయాలి

  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

నారాయణఖేడ్‌: రైతువేదిక నిర్మాణ పనుల్లో జాప్యం తగదని వేగవంతంగా పూర్తిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం కలెక్టర్‌ నారాయణఖేడ్‌ మండలం నిజాంపేటలో రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సర్పంచ్‌ జగదీశ్వర్‌చారికి సూచించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ఇసుక కొరత మూలంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే కలెక్టర్‌ స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, పీఆర్‌ ఏఈలు బాలలింగం, మాధవనాయుడు ఉన్నారు. 

నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు.. 

కల్హేర్‌: గడువులోగా రైతువేదికల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగదర్‌, కృష్ణాపూర్‌, మార్డి, కల్హేర్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నత్తనడకగా కొనసాగుతుండడంతో కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. నిర్మాణాలు చేపట్టిన గ్రామాల్లో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పగలు, రాత్రి రెండు సిఫ్టుల్లో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. సంగారెడ్డి చుట్టూ ఉన్న మండలాల్లో పనులు వేగవంతంగా పూర్తి అయి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయన్నారు. ఆయన వెంట ఆర్డీవో అంబదాస్‌ రాజేశ్వర్‌, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ పద్మావతి, ఏవో శశాంక్‌, అధికారులు ఉన్నారు. 

నాణ్యతగా  చేపట్టాలి

హత్నూర : రైతు వేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని చింతల్‌చెరులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతువేదికల నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ జయ రాం, ఎంపీడీవో శారదాదేవి, ఎంపీవో సువర్ణ ఉన్నారు.


logo