మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Sep 06, 2020 , 02:35:54

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు

ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు

  • n తెలంగాణ ప్రజలు ప్రణబ్‌ముఖర్జీని ఎప్పటికీ మరువరు
  • n రామలింగారెడ్డి మరణం అందరికీ విషాదకరం
  • n జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
  • n రెండు నిమిషాలు సంతాపం ప్రకటించిన ప్రజాప్రతినిధులు

మెదక్‌: తెలంగాణ ప్రజలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌ కలెక్టరేట్‌లో మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రణబ్‌ ముఖర్జీ నలభై ఎనిమిది సంవత్సరాల పాటు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్తమ పదవులు అలంకరించి మంచి సేవలను అందించారని అన్నారు. ఆయన మహామనిషని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నాందిపలికారని చెప్పారు. ఆయన మృతి చెందడం ఎంతో విషాదకరమని, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షులుగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సమయంలో కూడా రాష్ట్రపతిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదముద్ర వేశారని చెప్పారు. తెలంగాణ బిల్లు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం లభించిందని శేరి సుభాష్‌రెడ్డి గుర్తు చేశారు. అలాంటి మహానేత మరణం దేశానికి తీరని లోటన్నారు. తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ ప్రణబ్‌ముఖర్జీని గుర్తించుకుంటుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం రాష్ర్టానికి తీరని లోటన్నారు. తనకు రామలింగారెడ్డితో 20 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారని, ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. 

మహోన్నత వ్యక్తిని కోల్పోవడం దేశానికి తీరని లోటు..

-మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 

ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ రాష్ట్రం, ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, మహోన్నత వ్యక్తిని కోల్పోవడం దేశానికి తీరని లోటని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతిగా, భారతరత్న కూడా అందుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో ప్రణబ్‌ ముఖర్జీని వ్యక్తిగతంగా కలిసిన విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఇటీవల మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి 2003 తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలిసిన వ్యక్తి అని, ఉద్యమంలో ఎంతో పని చేశారన్నారు. రామలింగారెడ్డిని తాను అన్నా అని పిలిచేదని, వారి కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ప్రజా జీవితంలో అందరితో కలుపుగోలుగా ఉండే వారని అన్నారు. ఆయన ప్రతి విషయంలో పట్టు సాధించి అన్ని విషయాల్లోనూ తనదైన శైలిలో పనిచేశారని, రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అభివృద్ధి, ప్రగతికి చేపట్టిన పనులు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ చేసిన సేవలు దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చాయని చెప్పారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అందుకే దేశం భారతరత్న ఇచ్చి ఆయనకు తగిన గౌరవం ఇచ్చిందని అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo