శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Sep 04, 2020 , 00:24:40

బాగు.. బాబు..మల్చింగ్‌ సాగు

బాగు.. బాబు..మల్చింగ్‌ సాగు

వ్యవసాయ ఉద్యానవన రంగాల్లో ప్లాస్టిక్‌ పరికరాల ఆవశ్యకత మన దేశంలో 50 ఏండ్లకు పూర్వమే ప్రారంభమైంది. ఇది ఇనుము, ఉక్కు వంటి లోహ పరికరాలతో పోలిస్తే తేలికగా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నుతుంది. పైగా తక్కువ ధరలో లభిస్తుంది. నిర్వహణ చాలా అనుకూలంగా ఉండడంతో వీటి వాడకం రో జు రోజుకూ పెరుగుతున్నది. ప్లాస్టిక్‌ మల్చింగ్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో రైతులు వీటి వాడకానికి ఆసక్తి కనబరుస్తున్నారు.   - మెదక్‌

మల్చింగ్‌ అంటే..

మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్‌ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లను వాడేవారు. వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతుండడంతో వాటి లభ్యత రానురాను తగ్గిపోయింది. దీని కి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్‌మల్చింగ్‌ను ప్రస్తుతం వాడుతున్నారు. 

ఎరువులు, క్రిమిసంహారక మందుల ఆదా..

నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరల్లోకి వెళ్లకుండా నివారించడంతో కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందుల ఆవశ్యకత తగ్గి  డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. 

మల్చింగ్‌ షీట్ల లక్షణాలు

గాలిని భూమిలోకి చొరబడనీయనిదై ఉండాలి. నేలలో ఉండే ఉష్ణోగ్రతను బట్టి వాతావరణంలో కలువకుండా ఉండేలా చేయాలి. భూమిపై పరిచిన తర్వాత కనీసం ఒక పంటకైనా మన్నిక వచ్చేలా ఉండాలి. 

మల్చింగ్‌ షీటు సైజులు..

ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్లు వివిధ మందాల్లో లభిస్తాయి. ఈ షీట్లను మైక్రాన్లు, గేజీల్లో కొలుస్తారు. ఒక మైక్రాన్‌ మందం నాలుగు గేజీలతో సమానం. మల్చింగ్‌ షీట్లు 7 నుంచి 200 మైక్రాన్ల మందంలో 1.5 నుంచి 4 మీటర్ల వెడల్పులో చుట్టల రూపంలో లభిస్తాయి. పంట కాలాన్ని బట్టి వివిధ మందం ఉన్న షీట్లను వాడుకోవాలి. 

మల్చింగ్‌ వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

మల్చింగ్‌ షీటు వేసే ముందు మడులు చేసుకొని వాటిపైన డ్రిప్‌ సౌకర్యం ఉన్నవారు డ్రిప్‌ లైన్‌ పరుచుకొని వాటిపైన మల్చింగ్‌ షీటు పరుచుకోవాలి. మల్చింగ్‌ షీటును బలంగా లాగరాదు. చల్లని సమయాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మల్చింగ్‌ షీటు వేసుకోవాలి. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్‌ షీటు వేయకపోవడం ఉత్తమం.  

ప్లాస్టిక్‌ మల్చింగ్‌తో లాభాలు

lనీటి ఆదా.. మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమ బయటికి వెళ్లకుండా నివారించడంతో వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 నుంచి 40 శాతం నీరు ఆదా అవుతుంది. దీనికి తోడు బిందు సేద్య పద్ధతి వాడితే అదనంగా 20 శాతం నీరు ఆదా అవుతుంది. తద్వారా పం టకు రెండు నుంచి మూడు తడులు ఆదా అవుతాయి.

lకలుపు నివారణ.. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం ద్వారా కిరణజన్యసంయోగక్రియ జరగక సుమారు 85 శాతం వరకు కలుపు నివారణ అవుతుంది. దీంతో కలుపు నివారణ మందుల ఖర్చు తగ్గుతుంది. 

lమట్టి కోత నివారణ.. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం ద్వారా మట్టికోతను నివారించి భూసారాన్ని పరిరక్షించొచ్చు. 

lనేలలో ఉష్ణోగ్రత నివారణ.. మొక్క చుట్టూ సూక్ష్మవాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలను అందేలా చేస్తుంది. 

lచీడపీడల నివారణ.. పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మినిలోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కీటకాదులు, తెగుళ్లను నివారిస్తుంది. దీంతో నేల సోలరైజేషన్‌ జరుగుతుంది.

అధిక దిగుబడులు సాధించవచ్చు

మొక్కలకు వాటి జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగడం ద్వారా పంట ఏపుగా పెరిగి నాణ్యతతోపాటు 20 నుంచి 25 శాతం అధిక దిగుబడులు పొందవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడంతో నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీంతో నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. మల్చింగ్‌ షీట్లు అతినీలలోహిత, పరారుణ కిరణాలను తట్టుకునే విధంగా రసాయన శుద్ధి చేసి తయారు చేయడంతో వీటి మన్నిక కనీసం మూడు సంవత్సరాలు ఉంటుంది. ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వివిధ రంగుల్లో లభిస్తుంది. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, వెండి రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రంగు షీటు ఒక్కో పంటకు కాలానుగుణంగా వాడాలి.

మల్చింగ్‌ పద్ధతితో అధిక దిగుబడులు

మల్చింగ్‌ పద్ధతితో రైతులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి ఆదా, కలుపు, చీడపీడల నివారణతోపాటు అధిక దిగుబడులు పొందవచ్చు. మల్చింగ్‌ షీట్‌ వేసుకునే రైతుకు ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ అందిస్తున్నాం. రెండు నుంచి ఐదెకరాలకు రూ.32 వేలు ఖర్చవుతుంది. 50 శాతం సబ్సిడీ కింద రూ.16 వేల రాయితీ కల్పిస్తున్నాం.

-  సతీష్‌ ఏవో, నిజాంపేట్‌ 

తాజావార్తలు