గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Sep 04, 2020 , 00:24:44

అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు

అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు

  • n పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 
  • n 11,665 దరఖాస్తుల్లో  1718 మంది అర్హులు 
  • n ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా కేసులు
  • n సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

గజ్వేల్‌ : నిరుపేదలైన అర్హులకే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కేటాయిస్తున్నామని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. గురువారం ములుగులోని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాస్థాయి అధికారులతో 21 బృందాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇండ్ల కోసం 11665 దరఖాస్తులు రాగా, 1718 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. అర్హుల జాబితాను ఇప్పటికే అన్ని వార్డుల్లో ప్రకటించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన 235 అభ్యంతరాలను స్వీకరించి, విచారణ చేపట్టామన్నారు. కొంతమంది దళారులు రూ.50 వేలు ఇస్తే  ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వారిని నమ్మొద్దన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే కలెక్టర్‌ కార్యాలయంలో కానీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కానీ సమాచారం అందించాలని కోరారు.

పారదర్శకంగా ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక..

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 11665 మంది వివరాలను అన్ని అంశాల్లో సమాచారం తీసుకుని తమ వద్ద భద్రపరుచుకున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారుల ఆస్తుల వివరాల్లో భూ ములు, ఇండ్ల్లు, వ్యాపారాలు, సొంత వాహనాలు, ప్లాట్లు ఇతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని, రైతుబంధు, రైతుబీమా, రిజిస్ట్రేషన్‌, విద్యుత్‌ బిల్లులు వివరాలను ఆర్టీవో కార్యాలయాల నుంచి సేకరించామన్నారు. ఇండ్ల కేటాయింపులో గోప్యం లేదని, రాజకీయ నాయకుల ప్రమేయం అంతకన్నా లేదన్నారు. ప్రలోభాలకు గురిచేసే వారి వివరాలను తెలిపే వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గజ్వేల్‌లో 1250, దుబ్బాకలో 1500 ఇండ్లకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. 

ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరంగా శిక్షిస్తాం : సీపీ జోయల్‌ డెవిస్‌ 

ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలోప్రజలను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరంగా శిక్షిస్తామని సీపీ జోయల్‌ డెవిస్‌ హెచ్చరించారు. ఈ విషయమై తమకు ప్రాథమిక సమాచారం అందిందని, టాస్క్‌ఫోర్స్‌ స్పెషల్‌ బ్రాంచ్‌కి చెందిన 5 టీంల తో విచారణ చేపట్టామన్నారు. లబ్ధిదారులను అపోహలకు గురిచేస్తే 7901100 100, 8332921100 నెంబర్లకు వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 


logo