సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Sep 03, 2020 , 00:13:18

రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలి

రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలి

  • మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్‌ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు చాలా వరకు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవన్నారు. సంబంధిత అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేయాల్సిందిగా సూచించారు. ఆయా గ్రామాల్లో రైతులు తాము పండించే పంటలు, నియంత్రిత సాగు, వ్యవసాయ సంబంధిత సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా వీటి నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే సూచించామని అదే తీరున నిర్మాణాలు చేపట్టాలన్నారు. రైతు వేదికల నిర్మాణాలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు నాణ్యత ఉండేలా నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ దృష్టికి పలు విషయాలను తీసుకురాగా, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌, ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య, మైనింగ్‌ శాఖ అధికారి జయరాజ్‌, మెదక్‌ ఆర్డీవో సాయిరాం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

రైతు వేదికల నిర్మాణాల పరిశీలన 

పుల్కల్‌: రైతు వేదికలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ నర్సింగరావు అన్నారు. బుధవారం మండలంలోని గొంగ్లూర్‌, పెద్దారెడ్డిపేట, పుల్కల్‌, కోర్పోల్‌ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను ఆయన పరిశీలించారు. రైతు వేదికలను  త్వరగా పూర్తిచేయాలని కాట్రాక్టర్లను సూచించారు.  ఆయన వెంట  జోగిపేట ఏడీఏ అరుణ, పుల్కల్‌ ఏవో చైతన్య, ఏఈవో మనీషా ఉన్నారు.


logo