శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Aug 30, 2020 , 23:18:36

పల్లెప్రగతితో గ్రామాలకు కొత్తరూపు

పల్లెప్రగతితో గ్రామాలకు కొత్తరూపు

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ మండలంలోని 14 పంచాయతీల్లో పరిశుభ్రత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల్లో నెలకొన్న ముండ్ల పొదలు,కలుపుమొక్కలు,గడ్డిని తొలిగించి శుభ్రం చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనడంతో అతిసార,డయేరియా వ్యాధులు ప్రజల దరిచేరడం లేదు. ప్రతి శుక్రవారం అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తమ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందుతుండటంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంటి పరిసరాల ముందున్న పెంట కుప్పలను తొలిగించి దాంట్లో మట్టితో నింపేశారు. పురాతన పెంకుటిండ్లు, పాడుబడిన పాత గోడలను కూల్చివేయించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.

పరిశుభ్రత నెలకొన్నది 

పల్లెప్రగతితో గ్రామాల్లో పరిశుభ్రత నెలకొంది.గ్రామాల్లోని ముండ్ల పొదలు, కలుపుమొక్కలు,గడ్డిని తొలిగించాం. పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడూ గ్రామాల్లో పర్యటిస్తూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

- అరుంధతి, తూప్రాన్‌ ఎంపీడీవో 

అతిసార, డయేరియా వ్యాధులు లేవు 

పీహెచ్‌సీ దవాఖానతో పాటు మండలంలో 10 సబ్‌సెంటర్లున్నాయి. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుండటంతో డయేరియా,అతిసార వ్యాధులు ఎవరికీ నిర్ధారణ కాలేదు. పల్లెప్రగతితో గ్రామాల్లో పరిశుభ్రత నెలకొనడంతో సీజనల్‌ వ్యాధులు కన్పించడం లేదు. కరోనా దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇండ్లలోనే మిషన్‌ భగీరథ నీటిని వేడి చేసుకొని తాగుతున్నారు. ఇండ్ల భోజనానికే అలవాటు పడటంతో ప్రజలకు ఎలాంటి జ్వరాలు,వ్యాధులు రావడం లేదు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడంతో వ్యాధులు వారి దరిచేరడం లేదు.

- ఆనంద్‌, తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్‌