శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 28, 2020 , 02:36:50

కళ చెదిరింది

కళ చెదిరింది

  • n కరోనాతో నిలిచిపోయిన సంగీత, నృత్య శిక్షణలు
  • n ఇండ్లల్లోనే శిష్యులు, దిక్కుతోచని స్థితిలో గురువులు
  • n కిరాయి కట్టలేక మూతపడుతున్న అకాడమీలు
  • n సాంస్కృతిక కార్యక్రమాలు లేక కళాకారుల అవస్థ

మునుపటి తరంతో పోల్చితే ప్రస్తుతం తల్లిదండ్రులు తమ చిన్నారులకు చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. తమ పిల్లల అభిరుచికి తగిన విధంగా సంగీతం, నృత్యం, పెయింటింగ్‌, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రూమెంట్‌, యాక్టింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌  తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. చిన్నారులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు నగరాల్లో చాలా అకాడమీలు ఉన్నాయి. ఎంతో మంది కళాకారులు మ్యూజిక్‌, డ్యాన్స్‌ సంస్థలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. కరోనా రాకతో ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులైంది. ఆ ‘కళ’ చెదిరింది. అకాడమీలు ఆర్థిక భారంతో మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఐదునెలలుగా ఆదాయం లేక పేద కళాకారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని అను మ్యూజికల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీలో సంగీతం, నృత్యం, డ్రమ్స్‌, ఫ్లూట్‌ తదితర వాయిద్యాలను ప్లే చేయడంపై శిక్షణ ఇస్తుంటారు. 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉండేవారు. కరోనాకు ముందే అకాడమీని విశాలమైన భవనంలోకి మార్చారు. నెలకు రూ.40 వేల కిరాయి. సరిగ్గా రెండు నెలలు గడిచాయో లేదో కరోనాతో అకాడమీ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. వైరస్‌ వల్ల విద్యార్థులెవరూ అకాడమీకి రాలేని పరిస్థితి. దీంతో ఆదాయం పడిపోయింది. నెలకు రూ.40 వేలు కిరాయి మీద పడుతున్నది. ఇది ఒక్క అను మ్యూజికల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ పరిస్థితే కాదు. చాలా ఇనిస్టిట్యూట్ల పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇలాంటి శిక్షణాలయాలు కరోనా దెబ్బకు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.

కిరాయి భారం భరించలేక..

సంగీత, నృత్య అకాడమీలను ప్రత్యేక వాతావరణంలో ఏర్పాటు చేస్తుంటారు. విశాలమైన గదుల్లో అకాడమీలను నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అకాడమీల నిర్వహణకు అనేక జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు కలుగకుండా సౌండ్‌ ప్రూఫ్‌ తదితర వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కల్చరల్‌ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు భవన యజమానులు ఎక్కువ మొత్తంలో కిరాయి డిమాండ్‌ చేస్తుంటారు. ప్రాంతం ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు కిరాయి చెల్లించేవారున్నారు. అలాగే కరెంట్‌ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులను కూడా అకాడమీ నిర్వాహకులు భరించాలి. అయితే కరోనాకు ముందు వరకు అంతా బాగానే ఉన్నా.. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి అకాడమీ నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఒక్కో ఇనిస్టిట్యూట్లో సుమారు 30 నుంచి 40 మంది వరకు శిష్యులు ఉండేవారు. కొన్నింటిలో 100 మందికి పైగానే విద్యార్థులు ఉండేవారు. శిష్యులు ఇంటికే పరిమితమవడంతో అకాడమీలు పెద్దమొత్తంలోనే ఆదాయాన్ని కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొందరు తమ అకాడమీలను మూసివేశారు. సాధారణంగా సంగీత, నృత్య కళారంగాల్లో ప్రవేశానికి శ్రావణ మాసాన్ని మంచి ముహూర్తంగా భావిస్తుంటారు. అయితే ఇప్పటికీ అకాడమీలు తెరువలేని పరిస్థితి నెలకొనడం, తెరిచినా ఎవరూ రాని పరిస్థితి. తీసివేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు నష్టాలను భరిస్తూ.. వాటిని కొనసాగిస్తున్నారు.

ఆన్‌లైన్‌ క్లాసులు అంతంత మాత్రమే

సాధారణంగా సంగీతం, నృత్యం నేర్చుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. బాల్యం నుంచే ఆయా అంశాల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా పెద్దలు వారికి ఇతర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తుంటారు. వీరికి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడం కష్టమే. చిన్నారులకు సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వసతులు ఇండ్లలో అందుబాటులో లేకపోవడం ఒక కారణం. కొందరు పెద్దలు మాత్రమే ఆన్‌లైన్‌లో సంగీత, నృత్య ఇతరత్రా అంశాల్లో శిక్షణ తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.    

సాంస్కృతిక కార్యక్రమాలు లేక అవస్థలు

వివాహాలు, పండుగలు, ఇతర పర్వదినాలు, శుభకార్యాల్లో సంగీతం, నృత్యం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఆయా కార్యక్రమాల కోసం అకాడమీలను నిర్వహించేవారు కూడా ఉన్నారు. మరికొందరు కోరస్‌ గాయకులుగా, సైడ్‌ డ్యాన్సర్లుగా  కూడా పనిచేస్తుంటారు. మరికొందరు కళాకారులు పార్ట్‌ టైం శిక్షకులుగా వ్యవహరిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఐదునెలలుగా అకాడమీలు తెరుచుకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో వీరి ఉపాధికి గండి పడింది. మరో వృత్తిలోకి వెళ్లలేక, ఆదాయం లేక ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నారు. ఆర్ట్‌ గ్యాలరీలు కూడా మూతపడ్డాయి. వాటి నిర్వాహకుల పరిస్థితి కూడా ఇదే    విధంగా ఉన్నది.

కిరాయి కట్టడం భారంగా ఉన్నది

కరోనా మూలంగా పిల్లలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. మా అకాడమీలో 50 మందివరకు శిక్షణ పొందేవారు. అందులో ఇప్పుడు ముగ్గురు, నలుగురు, అదీ పెద్దలు మినహా మరెవరూ అకాడమీకి రావడంలేదు. ఆదాయం పూర్తిగా పడిపోయింది. కిరాయి కట్టడం భారంగా మారింది. అదీగాక అకాడమీలో శిక్షణ ఇచ్చే గురువులకు కూడా ఉపాధిలేకుండా పోయింది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏవిధంగానైనా ఆదుకుంటే బాగుంటుంది.  

- దివ్య, జనరల్‌ సెక్రటరీ, అను మ్యూజికల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ


logo