బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Aug 26, 2020 , 23:53:32

‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామాలు

‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామాలు

  • n రాష్ట్రంలోనే మొదటగా ఉమ్మడి జిల్లాలో పూర్తయిన డంపింగ్‌ యార్డులు
  • n బాగు పడిన పల్లెలు, కనిపించని సీజనల్‌ వ్యాధుల కేసులు
  • n ఇంట్లోనే నల్లా నుంచి స్వచ్ఛమైన భగీరథ నీళ్లు
  • n ఉమ్మడి జిల్లాలో 1793 జీపీలు..  17 మున్సిపాలిటీలు
  • n అన్ని జీపీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, డోజర్లు
  • n చెత్త తరలింపుతో శుభ్రమైన పల్లెలు
  • n గ్రామాల్లో నిర్మాణంలో పల్లె పార్క్‌లు
  • n గతేడాది జూలై, ఆగస్టులో 106 కేసులు
  • n ఈ ఏడాది జూలై, ఆగస్టులో కేవలం 20 కేసులే 
  • n డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు అన్నీ తగ్గుముఖం..
  • n పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం..

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

పల్లెసీమల ముఖచిత్రాన్ని మార్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాలతో పల్లెసీమలు శుభ్రతకు మారుపేరుగా మారుతున్నాయి. ఒకప్పటి ఊరును ఇప్పుడు మారిన ఊరుతో ఏమాత్రం పోల్చలేని పరిస్థితి. పంచాయతీ ట్రాక్టర్లు ఇంటింటి నుంచి చెత్త సేకరించి, ఊరవతల నిర్మించిన డంప్‌యార్డుకు తరలిస్తున్నాయి. ప్రజలు వీధుల్లో చెత్త వేయడం లేదు. మురికి కాలువలు బాగయ్యాయి. పెంటకుప్పలు, మురికినీటితో కూడిన గుంతలు కనిపించడం లేవు. ‘పల్లె ప్రగతి’ ఊరు దశను మార్చింది. వానకాలం వచ్చిందంటే గతంలో వ్యాధులతో పల్లెలు విలవిల్లాడేవి. జ్వరాలతో జనం మంచం పట్టేవారు. పల్లెలు బాగుపడడంతో వ్యాధులూ దూరమయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,793 గ్రామ పంచాయతీలు, 17 మున్సిపాలిటీలున్నాయి. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా 4.31 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు తమ ఇండ్లలోనే నల్లా ద్వారా స్వచ్ఛమైన నీరు తాగడంతో కూడా వ్యాధులు తగ్గాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతి నెల పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తున్నది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన సమస్యలు అన్ని పరిష్కారం కావడంతో వ్యాధులు ప్రజల దరి చేరడం లేవు. పల్లెలతో పాటు మున్సిపాలిటీలు కూడా పట్టణ ప్రగతితో బాగవుతున్న విషయం తెలిసిందే.. 

పల్లెల దశ మార్చిన ‘పల్లె ప్రగతి’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం పల్లెసీమల దశ మార్చింది. అస్తవ్యస్థంగా ఉండే పల్లెలు ఇప్పుడు ప్రగతి చిహ్నాలుగా మారాయి. గతంలో వానకాలం వచ్చిందంటే వ్యాధులు, రోగాలతో మంచం పట్టే పల్లెల్లో ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. పల్లె ప్రగతితో గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించారు. మురికికాలువను శుభ్రం చేయడం మొదలుకుని నీరు నిలువ ఉండే ప్రదేశాలు గుర్తించి మొరంతో బాగు చేయడం. వాటర్‌ పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతులు, పురాతన ఇండ్ల కూల్చివేతలు చేపట్టారు. వాటర్‌ ట్యాంకర్లను ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయించారు. ఇలా ప్రతి అంశాన్ని పల్లె ప్రగతిలో కార్యక్రమం గుర్తించి ఏదైనా సమస్యలుంటే పరిష్కరించారు. మంత్రి మొదలుకుని కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లోనే మకాం వేసి దగ్గరుండి పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.  

ప్రతి ఊరిలో డంప్‌యార్డు, ట్రాక్టర్‌

గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో డంప్‌యార్డులు నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉమ్మడి జిల్లాలోని 1793 గ్రామాల్లో డంప్‌యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్రంలో డంప్‌యార్డులు మొదటగా పూర్తయింది కూడా సంగారెడ్డి జిల్లాలోనే ఆ తరువాత మెదక్‌, సిద్దిపేట జిల్లాలో పూర్తయిన విషయం తెలిసిందే. పూర్తి కావడంతో పాటు ఎరువుల తయారీ ప్రక్రియ కూడా మొదలైంది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ట్రాక్టర్‌తో పాటు ట్రాలీ, ట్యాంకర్‌, డోజర్లు తీసుకున్నారు. రోజువారీగా ట్రాక్టర్లు ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తలు సేకరించి ఊరవతల నిర్మించిన డంప్‌యార్డులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించడం లేదు. అంతేకాకుండా చెత్త ఆరుబయట వేస్తే జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన రావడంతో చెత్తను బయట పడవేయడం లేదు.

వానకాలం వచ్చిందంటే పరుగులు పెట్టేవాళ్లం..

గతంలో వానకాలం మొదలైందంటే చాలు అధికారులమైన తాము గ్రా మాలకు పరుగులు పెట్టేవాళ్లం. ఏ ఊరి నుంచి ఎలాంటి వార్త వినపడు తుందోనని భయపడిపోయేవాళ్లం. కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థ త, డెంగ్యూ జ్వరాలతో ఊరు విలవిల, అతిసారతో గ్రామంలో వైద్య శిబిరా లు. ఇలాంటి వార్తలే ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మార్చింది. ప్రభుత్వం కూడా ప్రతి నెల పంచాయతీలకు సరిపడా నిధులు అందిస్తున్నది. ట్రాక్టర్లు రావడంతో చెత్త తరలింపుతో పాటు పిచ్చిమొక్కలను తొలగింపు సులువైంది. పల్లెప్రగతిలో పాత ఇండ్లను తొలగించాం. నీరు నిలువ ఉండే ప్రదేశాలను గుర్తించి మొరంతో బాగుచేయించాం. మురికికాలువలు ఎప్పటికప్పుడు బాగుచేయడంతో నీరు నిలువకుండా వెళ్లిపోతున్నది. చాలామంది రైతులు ఈజీఎస్‌ నిధులతో బావుల వద్ద పశువుల పాకలు నిర్మించుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో దోమలు, ఈగలు కనిపించకుండా పోయి వ్యాధులు తగ్గాయి. హరితహారంతో పచ్చదనంతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటున్నది. 

- వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి


logo