గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Aug 25, 2020 , 00:41:59

ధైర్యే సాహసే మందు..

ధైర్యే సాహసే మందు..

రామచంద్రాపురం: భయం మనిషి రోగనిరోధకశక్తిని దెబ్బతీస్తోంది.. భయం మనిషిలోని రోగాన్ని మరింత ప్రభావితం చేస్తోంది.. అదే భయం వదిలి ధైర్యంగా ఉంటే ఎంతటి జబ్బునైనా నయం చేసే శక్తి శరీరానికి ఉంటుంది. కరోనా విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.. కరోనా పాజిటివ్‌గా వచ్చిన వారిలో కొందరు ధైర్యంగా ఉండి హోం క్వారంటైన్‌లో తగిన జాగ్రత్తలు, మందులు, బలవర్ధకమైన భోజనం తీసుకుంటూ త్వరగా కొలుకుంటున్నారు. ఆర్సీపురం డివిజన్‌లోని పీహెచ్‌సీ స్టాఫ్‌ నర్సు కొండి స్వాతి కరోనాను జయించి, తిరిగి ధైర్యంగా విధుల్లోకి చేరించి. కరోనాను జయించిన విధానంపై ఆమె మాటల్లోనే..

పాజిటివ్‌ వచ్చిన మొదటిరోజు భయమేసింది..

ఆర్సీపురం పీహెచ్‌సీ దవాఖానలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నా. పీహెచ్‌సీలోనే కరోనా పరీక్షలు చేస్తున్నాం. ఒక రోజు ఆర్సీపురానికి చెందిన ఓ మహిళ అస్వస్థతకు గురి కాగా, నేను నేరుగా సదరు మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను ముట్టుకొని చూశా. ఆమె గుండెపోటుతో మృతి చెందిందని కుటుంబీకులకు చెప్పి తిరిగి వచ్చా. మరుసటి రోజు నాకు జలుబుతో పాటు జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి, పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. తర్వాత నా భర్త రాజశేఖర్‌రావు, ఇద్దరు పిల్లలకు పరీక్షలు చేయిస్తే భర్తకు మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. పిల్లలకు నెగెటివ్‌ వచ్చింది. వెంటనే పిల్లలను అత్తగారింటికి పంపించా. మా ఇద్దరికి మొదటి రోజు భయం వేసింది. పీహెచ్‌సీ డాక్టర్‌ రజిని సూచనలు పాటిస్తూ ఇంట్లోనే 21 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నాం.

 

21 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రతిరోజూ ఉదయం, రాత్రి లీటర్‌ నీటిలో ఒక స్టీమ్‌ ట్యాబ్లెట్‌ వేసి ఆవిరి పట్టేవాళ్లం. రెండు పూటలు కాషాయం తాగేవాళ్లం. ప్రతిరోజూ రెండు పూటల ఉడకబెట్టిన గుడ్లు, రెండు రోజులకు ఒకసారి చికెన్‌, చేపలు తీనేవాళ్లం. పప్పు, ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకున్నాం. గోరువెచ్చటి నీళ్లే తాగేవాళ్లం. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు ప్యారసిటమాల్‌, అజిత్రోమైసిన్‌, లివోసిట్రజిన్‌, రేరోడాల్‌ ఎస్‌పీ, బలానికి బీకాంప్లెక్స్‌, విటమిన్‌-సీ, జింక్‌, ర్యాన్‌టాక్‌ గోళీలను ఉదయం, రాత్రి వేసుకునేవాళ్లం. హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఇంటి పక్కన వారు సహాయం చేశారు. మార్చి 17న పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 4న సంగారెడ్డిలో పరీక్షలు చేయించుకుంటే మళ్లీ పాజిటివ్‌ రాగా, 10వ తేదీన చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. లక్షణాలు లేకపోవడంతో 11న డ్యూటీలో చేరా.


కరోనా వస్తే భయపడకుండా ధైర్యంగా ఉండడమే కరోనాకు మందు అని పీహెచ్‌సీ స్టాఫ్‌ నర్సు స్వాతి చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే వైద్యుల సూచనలు క్రమం తప్పకుండా పాటించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భయం ఏ మాత్రం అవసరం లేదు. బ్రీతింగ్‌ సమస్య ఉంటే ఆవిరి పట్టాలి, కషాయం తాగాలి. వేడి నీళ్లు తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచే భోజనం తీసుకోవాలి. క్రమంగా మందులు వాడితే కరోనా దూరమవుతోంది. కరోనాను సాధారణ జ్వరం మాదిరిగానే భావించాలి. ఏ మాత్రం అధైర్యపడొద్దు. కరోనాను జయించి తిరిగి ధైర్యంగా డ్యూటీకి వెళ్తున్నా. ఇతరుల్లో ధైర్యం నింపుతున్నా.