గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 22, 2020 , 00:14:04

యూరియా అధిక వాడకంతో అనర్ధం

యూరియా అధిక వాడకంతో అనర్ధం

గజ్వేల్‌ : భూసారాన్ని పెంచడం, పైరు ఎదుగుదల కోసం రసాయనిక ఎరువులను వినియోగిస్తారు. కంపోస్టు ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు పంటల దిగుబడులు పెంచడానికి వీలు కల్పిస్తాయి. అయితే వివిధ కారణాలతో రసాయనిక ఎరువుల వాడకం అధికం కావడంతో పైరుకు కొత్తరకం తెగుళ్లు సోకుతున్నాయి. దీంతో పాటు వాతావరణ సమతుల్యతను దెబ్బతీయడం ఆందోళనకు గురిచేస్తున్నది. కొన్నేండ్లుగా రసాయనిక ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించడం లేదు. దీంతో భూసారంలో వివిధ పోషకాలు తగ్గి పైరుకు కొత్త తెగుళ్లు సోకుతున్నట్లు వ్యవసాయ నిఫుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యూరియా మోతాదుకు మించి వాడడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. యూరియా వాడకంపై రైతుల్లో అవగాహన కల్పించడానికి వ్యవసాయశాఖ, ‘ఆత్మ’ కమిటీలు సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయి. 

అవసరం మేర వాడడం ఉత్తమం...

పంటల సాగుకు కంపోస్టు ఎరువులతో పాటు రసాయనిక ఎరువుల వాడకం తప్పనిసరిగా మారింది. భూముల రకాలు, ప్రాంతాలు, అందుబాటులో ఉన్న పోషకాలను పరిగణలోకి తీసుకోవాలి. పంటల సాగు రకాలను బట్టి అవసరం మేరకు రసాయనిక ఎరువులను వాడాలి. భూసార పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువుల వాడకంతో పైరు ఏపుగా ఎదుగుదలకు తోడ్పడడమే కాకుండా భూసారాన్ని స్థిరీకరించడానికి వీలు కలుగుతుంది. ప్రతి మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు కావాల్సిన సూక్ష్మపోషకాలు అవసరం. వీటిని అవసర మేరకు అందిస్తేనే ఆశించిన మేర దిగుబడులు వస్తాయి. మార్కెట్‌లో వివిధ రకాల రసాయనిక ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 50 కిలోల బస్తా రూ.265 ధరకు లభిస్తుండగా, కాంప్లెక్సు ఎరువులు 20:20 :0 బస్తా రూ.1000లు, 28:28:0 బస్తా రూ.1275 , డీఏపీ బస్తా రూ.1200 నుంచి రూ.1220 వరకు లభిస్తున్నాయి. ఒకో బస్తా దుక్కి ఎరువు ధరకు 3నుంచి 4 బస్తాల యూరియా రావడంతో కొంతమంది రైతులు యూరియా వాడకాన్ని మోతాదుకు మించి వాడుతున్నారు. దీంతో యూరియా కొరతతో పాటు వివిధ రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాంప్లెక్సు ఎరువులకు బదులు యూరియా వాడకంతో భూసారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాలి,నీటి కాలుష్యంతో అనేక ఇబ్భందులు ఎదురవుతున్నాయి. యూరియా వాడకం తగిన మోతాదులో వాడడంతో పైరుకు మేలు కలగడమే కాకుండా రైతుకు పెట్టుబడి తగ్గుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

అధికంగా యూరియా వాడడానికి కారణాలు

 • కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో యూరియాను మోతాదుకు మించి వాడుతున్నారు.
 • యూరియా పైరుపై అతి త్వరలో ప్రభావం చూపడం, కాంప్లెక్సు ఎరువులు నెమ్మదిగా పనిచేయడం 
 • ఎరువుల సమగ్ర వాడకంపై చాలామంది రైతుల్లో అవగాహన లేక పోవడం
 • భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం పాటించక పోవడం
 • కౌలు భూములు దీర్ఘకాలిక కౌలు ఒప్పందం లేక, ఆ పంట వరకే పెట్టుబడిని కౌలు రైతు పరిమితం చేయడం
 • యూరియా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయడం కారణంగా.. 

యూరియాలో ఏముంది... 

యూరియాలో 46శాతం నత్రజని కలిగిన అత్యంత శక్తివంతమైన ఎరువు. తెల్లని గుళికల రూపంలో ఉన్న ఈ ఎరువు వెదజల్లడానికి అనుకూలంగా ఉండి, తేలికగా నీటిలో కరిగి మొక్కకు సమర్ధవంతంగా నత్రజనిని అందిస్తుంది.

అవసర మేరకు వాడకమే లాభదాయకం...

 • పైరుకు నత్రజని అవసరం మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. 
 • పంటలను బట్టి యూరియాను దప దఫాలుగా వాడాలి
 • సరైన తేమ ఉన్నప్పుడే యూరియాను పైరుకు అందించాలి.
 • వరికి నాటు, పిలక, చిరుపొట్ట దశల్లో యూరియాను తక్కువ నీరు ఉంచి చల్లాలి. 24 నుంచి 48గంటల వరకు నీరు బయటకు పోకుండా జాగ్రత్త వహించాలి.
 • 50 కిలోల యూరియాకు 5 కిలోల వేప పిండిని కలిపితే సమర్థవంతంగా పనిచేస్తుంది. చీడపీడలను నివారిస్తుంది.
 • మెట్ట పంటలకు యూరియా అందించినప్పుడు మొక్క మొదళ్ల వద్ద వేసిన యూరియాపై మట్టి కప్పితే, గాలిలో కరిగి ఆవిరి కాకుండా వృథాను అరికట్టవచ్చు.
 • అత్యవసర పరిస్థితుల్లో పైరుకు తక్షణమే నత్రజని అందించాల్సి వస్తే, 2నుంచి 3శాతం యూరియా ద్రావణాన్ని తయారు చేసుకుని మొక్కలపై పిచికారీ చేయవచ్చు.
 • డ్రిప్‌ ద్వారా పర్టిగేషన్‌ పద్ధ్దతిలో అందిస్తే అత్యధిక శాతం ఎరువులు ఆదా అవుతాయి.

విచక్షణా రహితంగా యూరియా వాడితే నష్టాలు...

 • యూరియా గాలిలో, నీటిలో కరిగి కాలుష్య ప్రమాదాన్ని పెంచుతుంది.
 • అధిక యూరియా వాడకంతో పైరు బాగా పెరిగి పడిపోతుంది. పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పెరుగుతుంది. 
 • తాలు గింజలు అధికమై పంట దిగుబడి బాగా తగ్గుతుంది.
 • నత్రజని అధికం కావడంతో పైరుపై చీడపీడ తెగుళ్ల బెడద పెరుగుతుంది. 
 • తెగుళ్ల నివారణకు క్రిమిసంహారక మందులు వాడడంతో పెట్టుబడి భారం పెరగడం, ఉత్పత్తుల నాణ్యత, దిగుబడులు తగ్గడంతో నష్టాలు పెరుగుతాయి.


logo