శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - Aug 20, 2020 , 03:35:25

జలవనరులన్నీ జలసాగరాలు

జలవనరులన్నీ జలసాగరాలు

ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ జలసాగరాలను తలపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలకు వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని సింగూరు, నారింజ, వనదుర్గా ప్రాజెక్టులు వరద ప్రవాహానికి జలకళ సంతరించుకున్నాయి. నారింజ ప్రాజెక్టు నిండి గేట్ల మీదుగా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వనదుర్గా ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగడంతో  సందర్శకులు తరలివచ్చి సెల్ఫీలు దిగుతూ, చేపలు పడుతూ సరదాగా గడిపారు.

- ఉమ్మడి మెదక్‌ జిల్లా, నెట్‌వర్క్‌ 

పల్లె చెరువుల మురిపెం..

నంగునూరు: మండల వ్యాప్తంగా చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలు పూర్తిగా నిండి తొణికిసలాడుతున్నాయి. మత్స్యకారులు సంబురంగా వలలు పట్టుకొని చేపలు పట్టుకుంటున్నారు. 20-30 ఏండ్లుగా నిండని చెరువులు నిండడంతో గ్రామాల్లో సంబురం నెలకొన్నది. చెరువుల వద్ద పూజలు, స్వీట్లు తినిపించుకుంటున్నారు. ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం తీసుకురాగా, మంత్రి హరీశ్‌రావు కృషితో మండలంలోని చెరువులను పునరుద్ధరించారు. గోదావరి జలాలకు తోడు వర్షం నీటితో చెరువులన్నీ నిండాయి. మండలంలో 208 చెరువులకు గాను 200 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. 

తొణికిసలాడుతున్న వనదుర్గా ప్రాజెక్టు

పాపన్నపేట: ఇటీవల కురుస్తున్న వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు నిండింది. మంజీరా నది పరీవాహక ప్రాంతం పైభాగంలో వర్షాలు కురుస్తుండడం వల్ల వరద నీరు వనదుర్గా ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్నది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో బుధవారం ఉదయం వరకు నీటిమట్టం 7 ఫీట్లకు పెరిగి, పొంగిపొర్లేందుకు సిద్ధంగా ఉన్నది. కొంత కాలంగా మంజీరా పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక వనదుర్గా ప్రాజెక్టు బోసిపోయింది. సింగూరు ప్రాజెక్టులో కూడా నీటి మట్టం తక్కువగా ఉండడంతో ఇక్కడి రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుతుండడంతో ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. కాలువల్లో చెత్తను తొలిగించి చెరువులను నింపుకోవాలని ఇరిగేషన్‌ ఈఈ యేసయ్య రైతులకు సూచించారు.

‘సింగూరు’ చిందులు..

పుల్కల్‌: సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యాంలోకి బుధవారం 1065 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి గతేడాది ఇన్‌ఫ్లో లేకపోగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 28 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1717 అడుగులకు (29.900 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1684.4 అడుగులకు (2.393 టీఎంసీల) నీరుందని జలవనరుల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు మిషన్‌ భగీరథకు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, మరో 75 క్యూసెక్కులు ఆవిరవుతున్నాయి. కాగా, ప్రాజెక్టు పరిసర ప్రాంతంల్లో బుధవారం 24 మీ.మీ వర్షం కురిసింది. ప్రాజెక్టుకు స్థానికంగా మునిపల్లి మండలం దుబ్బవాగు ప్రధాన క్యాచ్‌మెంట్‌ ఏరియా కావడంతో దుబ్బవాగు నీరంత డ్యాంలోకి చేరుతుంది. పరీవాహక ప్రాంతంలోని జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో కురిసిన నీరంతా వాగుల గుండా డ్యాంలోకే చేరుతుంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో మంజీరా నదిపై నీటి ప్రవాహం లేక పోవడంతో ఎగువ నుంచి ప్రవాహం రావడం లేదు. దీంతో 25 రోజులుగా డ్యాంలోకి స్థానిక పరీవాహకం నుంచి మాత్రమే ఇన్‌ఫ్లో చేరుతోంది. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో కేవలం 2.331 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవచ్చని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

‘నారింజ’ నవ్వింది..

జహీరాబాద్‌: అవును... నిజమే నారింజ ప్రాజెక్టు చిరునవ్వులు చిందిస్తున్నదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటితో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద ప్రవాహం బుధవారం ప్రాజెక్టు గేట్లను దాటి కర్ణాటక వైపు వెళ్తుండడం విశేషం. నారింజ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా, ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఇప్పటి వరకు వరద నీటి ద్వారా 46 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరిందని, వరద నీటి ప్రవాహం పెరితే గేట్లు ఎత్తి నీటిని వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నీటి వనరులశాఖ అధికారులు తెలిపారు.


logo