గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Aug 19, 2020 , 02:45:31

పారిశుధ్యంలో నంబర్‌ 1

పారిశుధ్యంలో నంబర్‌ 1

  • l 15 గ్రామాలు ఉత్తమ  పంచాయతీలుగా ఎంపిక 
  • l  జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలత గౌడ్‌

మనోహరాబాద్‌ : పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలత గౌడ్‌ అన్నారు.  మంగళవారం  మనోహరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో  ఆమె మాట్లాడుతూ పల్లెలను పట్టణాలను తలదన్నే విధంగా తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మొదటి, రెండో ప్రగతి ప్రణాళిక పనులు ఫలితాలు ఇచ్చాయన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, హరితహారం మొక్కలను పరిరక్షించుకోవడంలో సహకరిస్తున్నారన్నారు.  చెత్త నిర్వహణ కేంద్రా లు, వైకుంఠధామాల నిర్మాణం పనుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలు ముందంజలో ఉన్నాయన్నారు. 15 గ్రామాలు వంద శాతం ఓడీఎఫ్‌తో ఆదర్శంగా నిలిచాయన్నారు. త్వరలోనే వీటికి జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కలను పెంచాలని అధికారులు, నాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు.15 వ ఫైనాన్స్‌  జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలకు రూ. 8 కోట్ల 62 లక్షల 78 వేల 900 మంజూరు చేసిందన్నారు. వీటితో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులను మరింత వేగం చేసి రాష్ట్రంలో  జిల్లాను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామన్నారు. 

 నిరుపేదలకు ఆసరాగా సీఎం రిలీఫ్‌ఫండ్‌

ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ఆసరాగా నిలుస్త్తోందని జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతగౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ జడ్పీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంగళవారం సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఆమె అందజేశారు. కాళ్లకల్‌ గ్రామానికి చెందిన పిల్ల వాణికి రూ. 12,500, చీర్ల బాలయ్యకు రూ. 40,000, మనోహరాబాద్‌కు చెందిన అర్కెల లతకు రూ. 37,500, జీడిపల్లి గ్రామానికి చెందిన రూ. 36,000, కభామని నర్సింహులుకు రూ. 47,500, తూప్రాన్‌కు చెందిన దుర్గమ్మకు రూ. 20,000, హత్నూరకు చెందిన ఎస్‌. ఆంజనేయులకు రూ. 17,500 చెక్కులను  లబ్ధిదారులకు  ఆమె అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి,  వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ కో -ఆర్డినేటర్‌ పెంటాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్‌, రమేశ్‌, శ్రీరామ్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు. 


logo