గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 18, 2020 , 00:16:38

పాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

పాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

రామాయంపేట: వర్షం నీటితో నిండిన చెరువులో నీటిని  వృథా కాకుండా చర్యలను చేపడుతామని మునిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం కురిసిన  వర్షాలకు పట్టణంలోని మల్లెచెరువు, పాండు చెరువు, వెంకన్నగారి చెరువులను పరిశీలించి మత్స్యకారులకు పలు సూచనలు ఇచ్చారు.  చెరువులోని చేపలు ఇతర ప్రాంతాలకు  పోకుండా వలలు ఏర్పాటు చేయాలన్నారు. రామాయంపేటలో చెరువుల నుంచి వృథాగా వెళ్తున్న నీటికి అడ్డుకట్ట వేయాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేపట్టాలన్నారు. మున్సిపల్‌ పరిధిలోని కోమటిపల్లి, గొల్పర్తి గ్రామాల్లో రోడ్లపై పడ్డ గుంతలను పరిశీలించారు. చైర్మన్‌ వెంట మల్యాల కిషన్‌, మున్సిపల్‌ సిబ్బంది బిల్‌కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులున్నారు.

యావాపూర్‌లో పొంగిపొర్లుతున్న మూలవాగు  చెక్‌డ్యాం

తూప్రాన్‌ రూరల్‌ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని మరికొన్ని చెక్‌డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండల్లా మారాయి. మండలంలోని యావాపూర్‌ శివారులోని మూలవాగు వద్ద నిర్మించిన చెక్‌డ్యాం పొంగిపొర్లుతూ ప్రవహిస్తోంది. దమ్మన్నగుట్ట నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో నల్లమత్తడి చెక్‌డ్యాం నిండుకుండలా మారింది. యావాపూర్‌, కిష్టాపూర్‌, వెంకటాయపల్లి గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో  కూలిన ఇల్లు

 పట్టణంలో కురుస్తున్న  వర్షాలతో పురాతన ఇండ్లు కూలుతున్నాయి. ఆదివారం నుంచి కురిసిన వర్షానికి పట్టణంలోని లింగ రమేశ్‌కు చెందిన ఇల్లు సోమవారం ఉదయం కూలింది. 

 మండలంలో 19.6 మిల్లీమీటర్ల వర్షపాతం 

చిన్నశంకరంపేట: ఆదివారం రాత్రి నుంచి సోమవారం  వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో  వర్షం కురిసింది. మండలంలో 19.6 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటల్లోకి  నీరు చేరడంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.

ఝాన్సీలింగాపూర్‌ పాతచెరువుకు బుంగ

రామాయంపేట:  మండలంలోని ఝాన్సీలింగాపూర్‌ పాతచెరువుకు బుంగ పడటంతో గ్రామస్తులు, రైతులు  పూడ్చి వేశారు.ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు  నిండడంతో బుంగ పడ్డినట్లు గ్రామస్తులు తెలిపారు. మండలంలోని రాయిలాపూర్‌ గ్రామంలో వర్షానికి అదే గ్రామానికి చెందిన రాగి నారాయణ ఇల్ల్లు కూలిపోయింది. 

 వెల్దురిలో

 వెల్దురి:  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని బండపోసాన్‌పల్లి గ్రామానికి చెందిన పిట్ల నారాయణ ఇల్లు కూలిపోయింది.  తమను  ప్రభుత్వం ఆదుకోవాలని నారాయణ అధికారులను కోరారు. 

అలుగు పారిన రాయిన్‌పల్లి ప్రాజెక్ట్‌ 

మెదక్‌ రూరల్‌: నాలుగైదు రోజులుగా  కురుస్తున్న వర్షాలకు మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్ట్‌లోకి నీరు చేరి సోమవారం అలుగు పారింది. దీంతో ప్రాజెక్ట్‌ కింది రైతులు ఆనందం వ్యక్తం చేశారు.  కొంటూర్‌ చెరువులోకి సైతం నీరు చేరింది. సోమవారం ఉదయం వరకు మండలంలో 14.8 వర్షపాతం నమోదైంది. వర్షాలతో  అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ యమునా జయ రాంరెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదన్నారు. 

వనదుర్గాప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

పాపన్నపేట:  జిల్లాలోనే మధ్యతరహా  ప్రాజెక్టు వనదుర్గా ప్రాజెక్టు  (ఘనపూర్‌ ఆనకట్ట)లోకి సోమవారం సాయంత్రానికి వరద నీరు కొనసాగింది. మంజీరానది పై భాగంలో వర్షాలు పడుతుండటంతో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన నీటి ప్రవాహం సోమవారం సాయంత్రానికి పెద్ద ఎత్తున రాసాగింది. సాయంత్రం 7గంటల వరకు ఫతేనహర్‌ గేట్లను నీటి మట్టం తాకింది.


logo