ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Aug 18, 2020 , 00:17:01

పరిశ్రమల్లో భద్రతెంత..!

పరిశ్రమల్లో భద్రతెంత..!

  •  9  తనిఖీలు
  •  9  శాఖల అధికారులతో కమిటీలు
  •  9     ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు
  •  9  జోన్‌ పరిధిలోని పరిశ్రమల్లో క్షుణ్ణంగా పరిశీలన
  •  9  మెదక్‌ జిల్లాలో రెడ్‌జోన్‌లో 399 పరిశ్రమలు
  •  9  జోన్‌లో 488 పరిశ్రమలు
  •  9  తనిఖీల ప్రక్రియను   పర్యవేక్షిస్తున్న పరిశ్రమల శాఖ జీఎంలు

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టింది. పరిశ్రమల్లో భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..? కార్మికుల రక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి..? ఆయా పరిశ్రమలు ఏ మేరకు కాలుష్యాన్ని వదులుతున్నాయి..? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పరిశ్రమలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ కేటగిరీలుగా విభజించారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలు భద్రతతో కూడుకున్నవిగా గుర్తించారు. ప్రస్తుతం రెడ్‌జోన్‌లో ఉన్నవాటిపై అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 399 వరకు పరిశ్రమలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. వాటిలో మూడు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ తనిఖీల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 

-సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ  

భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలు కలిపి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3,702 పరిశ్రమలు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పటాన్‌చెరు గుర్తింపు పొందింది. సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు, జిన్నారం, గుమ్మడిదల, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, జహీరాబాద్‌ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాయి. మెదక్‌ జిల్లాలో మెదక్‌, చిన్నశంకరంపేట,తూప్రాన్‌, మనోహరాబాద్‌లలో పరిశ్రమలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, సిద్దిపేటల్లో పరిశ్రమలు ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 2,600 వరకు పరిశ్రమలు ఉండగా, సిద్దిపేట జిల్లాలో 652, మెదక్‌ జిల్లాలో 450 పరిశ్రమలు ఉన్నాయి. పటాన్‌చెరు, హత్నూర, తూప్రాన్‌, మనోహరాబాద్‌, సంగారెడ్డిలలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అన్నిరకాల కంపెనీలతో ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది. 

కేటగిరీల వారీగా విభజన..

పరిశ్రమలను కేటగిరీల వారీగా విభజించారు. గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌జోన్లు ఉన్నాయి. కాలుష్యంతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న కంపెనీలను రెడ్‌జోన్ల కింద, ఆ తర్వాత స్థానంలో ఆరెంజ్‌ జోన్‌లు ఉంటాయి. మిగతా కంపెనీలు గ్రీన్‌ జోన్‌లో ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలతో పాటు ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేనివన్నీ గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,702 పరిశ్రమలు ఉండగా, ఇందులో 421 వరకు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఇందులో ఎక్కువ కాలుష్యం వెదజల్లే ఫార్మా, ఇతర పరిశ్రమలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు మరో 632 వరకు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. మిగతా పరిశ్రమలు గ్రీన్‌ కేటగిరీలోకి వస్తాయి. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో విశాఖపట్నంలోని ఓ పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగిన విషయ ం తెలిసిందే. ఈ ప్రమాదం లో కెమికల్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యిం ది. జిల్లాలో అన్ని పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై తనిఖీలు చేపట్టాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. 

 ప్రత్యేక కమిటీల ఏర్పాటు..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశ్రమల్లో తనిఖీల కోసం అధికారులు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. పరిశ్రమ, కాలు ష్య, కార్మిక, బాయిలర్‌ డిపార్ట్‌మెంట్లతో కలిసి ఈ శాఖలను ఏర్పాటు చేశారు. ఆయా శాఖలకు చెందిన ప్రధాన అధికారులతో జిల్లాకు రెండు చొప్పన కమిటీలు వేశారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి పరిశ్రమల్లో తనిఖీలు మొదలు పెట్టారు. భద్రత విషయంలో పరిశ్రమ తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి..? కార్మికులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టా రు..? కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి..? ఇలాంటి అంశాలను ప్రధానంగా తీసుకొని తనిఖీ చేస్తున్నారు. చిన్నపాటి పొరపాట్లు ఉన్నచోట అక్కడికక్కడ పరిశ్రమల యాజమాన్యాలకు తనిఖీకి వెళ్లిన బృందం సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌కు ముందే సంగారెడ్డి జిల్లాలో రెడ్‌జోన్‌లో ఉన్న 90 పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం వాటిని మినహా ఇంచి మిగతా రెడ్‌ జోన్‌లో ఉన్న పరిశ్రమలను ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం వరకు 19 పరిశ్రమలను తనిఖీ చేశారు. మెదక్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌లో ఉన్న 10 వరకు, సిద్దిపేట జిల్లాలో కొన్ని పరిశ్రమలను తనిఖీ చేశారు. ప్రక్రియ కొనసాగుతున్నది.

పరిశ్రమల శాఖ జీఎంల పర్యవేక్షణ...

పరిశ్రమల్లో కొనసాగుతున్న తనిఖీల ప్రక్రియను ఆయా జిల్లాల పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్లు పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం జీఎంలకు అప్పగించింది. రోజు వారీగా ఎన్ని పరిశ్రమలు తనిఖీలు చేశారు..? వాటిని గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమిటి..? భద్రత విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పరిశ్రమలు..? ఇలా అన్ని అంశాలను జీఎంలు నోట్‌ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని పరిశ్రమల్లో తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం భద్రత, కాలుష్యం విషయంలో నిర్లక్ష్యం వహించే పరిశ్రమల విషయంలో చర్యలు తీసుకోనున్నది. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. టీఎస్‌ ఐపాస్‌ ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నది. ఇదే తరుణంలో నిర్లక్ష్యంగా వ్యహరించే కంపెనీలపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. 

నివేదికలు రూపొందిస్తున్నాం...

ప్రత్యేక కమిటీలు ప్రస్తుతం రెడ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నాయి. క్షణ్ణంగా పరిశీలించి అక్కడ పరిస్థితిపై వివరాలు అందిస్తున్నాయి. పూర్తి వివరాలతో నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తాం. కాలుష్యం వెదజల్లుతూ, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు పాటించాలి. ఈ తనిఖీలు పూర్తి కావడానికి మరో పది రోజుల సమయం పడుతుంది. 

-శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎం, సంగారెడ్డిlogo