బుధవారం 23 సెప్టెంబర్ 2020
Medak - Aug 15, 2020 , 00:27:23

భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

మెదక్‌ : అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించిన వివాదాలను వెంటనే పరిష్కరించాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు  అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో భూముల సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి న్యాయం చేయాలని ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ అటవీ భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కరోనా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లాలో అన్ని చోట్ల రైతు వేదికల స్థలాలను ఇప్పటికే గుర్తించమన్నారు. రైతు వేదికల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే కాల్వలకు ప్రభుత్వం భూ సేకరణ చేపట్టాలని ఇప్పటికే సూచించిందని తహసీల్దార్లు  క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. 

కరోనా పరీక్షలు విధిగా చేయాలి

ప్రతి రోజు పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు విధిగా నిర్వహించాలన్నారు. కిట్లు లేవని టెస్ట్‌లు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను  విపత్కర పరిస్థితి నుంచి ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌ ఆర్డీవోలు శ్యాంప్రకాశ్‌, అరుణారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


logo