గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 15, 2020 , 00:27:57

ఎనిమిదేండ్లకు అలుగు పారుతున్న శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు

ఎనిమిదేండ్లకు అలుగు పారుతున్న  శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు

  • n ఆయకట్టు రైతుల మోముల్లో నవ్వుల్‌ నవ్వుల్‌
  • n అదే దారిలో సింగరాయ ప్రాజెక్టు 
  • n మోయతుమ్మెద పరవళ్లు, నిండుతున్న చెరువులు, కుంటలు

కోహెడ : మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టు శనిగరం చెరువు 8 ఏండ్ల అనంతరం నిండి అలుగు పారుతున్నది. 500 ఎకరాల్లో ఉన్న ఈ  ప్రాజెక్టు 5500 ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్నది. నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1887లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మండలంలోని శనిగరం, తంగళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులతో పాటు బెజ్జంకి మండలంలోని 7 గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తూ కుటుంబాలకు బాసటగా ఉంటున్నది. సిద్దిపేట కోమటి చెరువు నుంచి వచ్చే నక్కవాగుతో పాటు చేర్యాల ప్రాంతం నుంచి వచ్చే మోయతుమ్మెద వాగు ఈ ప్రాజెక్టుకు నీటి వనరులు. గత వేసవిలో మంత్రి హరీశ్‌రావు నూతనంగా నిర్మించిన రంగనాయక సాగర్‌ కుడి, ఎడమల కాలువల నుండి నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు నింపడం, వర్షాకాలం ప్రారంభంలోనే సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నక్కవాగు, మోయతుమ్మెదల నుంచి వరద నీరు వచ్చి శనిగరం ప్రాజెక్టు త్వరగా నిండింది. దీంతో వర్షాకాలంతో పాటు యాసంగి రెండు పంటలకు రైతులకు సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు 8 ఏండ్లకు నిండి అలుగు పారుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సింగరాయలో జలసిరులు ... 

మండలంలోని కూరెల్ల శివారులోని మోయతుమ్మెద వాగుపై నిర్మించిన సింగరాయ ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి దుంకుతున్నది. 500 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రాజెక్టు నిండడంతో కూరెల్ల, వింజపల్లి గ్రామాల ఆయకట్టు రైతులు సంతోషపడుతున్నారు. రెండు గ్రామాల రైతులకు సాగునీటితోపాటు పరిసర ప్రాంతాల రైతుల బావుల్లో నీటి నిల్వలు పెరగనున్నాయి. మోయతుమ్మెద వాగు వరదతో పరవళ్లు తొక్కుతుండడంతో సింగరాయ ప్రాజెక్టు నిండి మత్తడి దుంకుతున్నది. మోయతుమ్మెద వాగులో వరద పరవళ్లు తొక్కుతుండడంతో మొదట పోరెడ్డిపల్లి చెక్‌డ్యాం నిండింది. మండలంలోని గుండారెడ్డిపల్లి చెక్‌డ్యాం, నారాయణపూర్‌ చెక్‌డ్యాంలు నిండాయి. నూతనంగా నిర్మిస్తున్న బస్వాపూర్‌, తంగళ్లపల్లి, రాంచంద్రాపూర్‌ చెక్‌డ్యాంలలో కూడా నీరు నిలిచింది. వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో కోహెడలోని బాదుగుల చెరువు, కుమ్మరికుంట నిండి అలుగుపోస్తున్నాయి.  

శనిగరం ఆయకట్టు రైతులకు ఇక ఢోకా లేదు

శనిగరం ఆయకట్టు రైతులకు ఇక ఢోకా లేదు. రెండు పంటలు చేతికి వస్తాయి. 20 సంవత్సరాలుగా శనిగరం ప్రాజెక్టు రెండు మూడేండ్లకు ఒకసారి నిండింది. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ చొరవ, మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రాజెక్టు రూ.25 కోట్లతో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. ఈ సంవత్సరం రైతులకు రెండు పంటలకు సాగునీరు అందనున్నది. రంగనాయక సాగర్‌ ద్వారా గత వేసవిలో సిద్దిపేట, నంగునూరు మండలంలోని చెరువులు కుంటలు నింపారు. దీంతో కొద్ది వారాలకే మోయతుమ్మెద వాగు, నక్కవాగు పరవళ్లు తొక్కి శనిగరం ప్రాజెక్టు తొందరగా నిండింది. మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టును రంగనాయక సాగర్‌ ద్వారా నింపడానికి హామీ ఇచ్చారు. 

- కర్ర శ్రీహరి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి logo