మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Medak - Aug 13, 2020 , 23:26:27

‘మార్కెట్ల’కు మస్త్‌ ఆదాయం

‘మార్కెట్ల’కు మస్త్‌ ఆదాయం

  •  l మార్కెట్‌ కమిటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు
  •  l మార్కెట్లకు రానున్న ఆదాయం
  •  l ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మెదక్‌ : రాష్ట్ర ప్రభుత్వం పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు ఏటా అందిస్తున్నది.  పండించిన పంటకు మద్దతు ధరను కల్పిస్తున్నది. ఇప్పటి వరకు రైతులు పండించిన పంటలను ఐకేపీ, పీఏసీఎస్‌లు  కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి మార్కెట్‌ కమిటీలతో  ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. దీంతో మార్కెట్‌ కమిటీలకు మస్తు ఆదాయం సమకూరనున్నది. రైతులు పండించిన పంటలను మార్కెట్‌ కమిటీలు కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 376ను విడుదల చేసింది. 

జిల్లాలో ఆరు మార్కెట్‌ కమిటీలు..

జిల్లాలో ఆరు మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్‌ మార్కెట్‌ కమిటీతో పాటు రామాయంపేట, నర్సాపూర్‌, పాపన్నపేట, తూప్రాన్‌, చేగుంట మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. జిల్లాలో రైతులు పండించిన పంటలను ఆయా మార్కెట్‌ కమిటీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యంతో పాటు కందులు, మొక్కజొన్నలు, వేరుశనగ, జొన్నలను తీసుకొస్తారు. గతంలో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేవారు. ఇక నుంచి మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. 

మార్కెట్‌లకు పూర్వ వైభవం..

కొద్ది రోజుల క్రితం మార్కెట్‌ ఫీజును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేయడంతో మార్కెట్ల భవితవ్యం ప్రశ్నార్థ్ధకంగా మారింది. ఇప్పటి వరకు మార్కెటింగ్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు సైతం కష్టంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కమిటీలకు పూర్వవైభవం రానున్నది. 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి

మార్కెట్‌ కమిటీలతో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మార్కెట్‌ కమిటీలకు సమీపంలో ఉన్న గ్రామాల నుంచి రైతులు పండించిన పంటలను తరలించవచ్చు. ఇప్పటి వరకు పీఏసీఎస్‌, ఐకేపీలతో  ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. ఇప్పుడు మార్కెట్‌ కమిటీలతో  కొనుగోళ్లు చేయనున్నారు. దీంతో మార్కెట్‌ కమిటీలకు ఆదాయం పెరుగనున్నది. 

-రమ్య, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి logo