శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Aug 13, 2020 , 23:26:54

కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

  • l అనాథాశ్రమంలోని రికార్డులు స్వాధీనం 
  • l నిందితుల అరెస్ట్‌, రిమాండ్‌ 
  • l ఆశ్రమం మూసివేత... చిన్నారుల తరలింపు
  • l కఠిన చర్యలు తీసుకోవాలని దళిత  సంఘాల డిమాండ్‌ 

అమీన్‌పూర్‌ : విరాళాలు ఇచ్చే నెపంతో అనాథాశ్రమానికి వస్తూ 14 ఏండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసినట్లు కేసు నమోదు కావడంతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆశ్రమ నిర్వాహకులు విజయ, జయదీప్‌లతోపాటు అఘాయిత్యానికి పాల్పడ్డ వేణుగోపాల్‌రెడ్డిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో విచారణ సాగుతున్నది. ఈ క్రమంలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత వచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఆశ్రమంలో పోలీసుల తనిఖీలు... 

లైంగికదాడికి గురైన బాలిక ఉండే అమీన్‌పూర్‌లోని మారుతి ఆశ్రమాన్ని పోలీసులు సందర్శించారు. గురువారం డీఎస్పీ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆశ్రమాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమానికి ఎవరెవరు వచ్చేవారు, విరాళాలు  తరుచూ ఇచ్చేవారెవరు అన్న సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు ఆశ్రమంలోని చిన్నారుల వివరాలను సేకరిస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ఇతర సమాచారాన్ని స్థానికులనూ అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా, ఆశ్రమం ఎలా నడిచేది, నిర్వాహకులు చిన్నారులను ఎలా చూసుకునేవారు.. తదితర వివరాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. 

ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. 

అమీన్‌పూర్‌లోని ప్రైవేటు అనాథాశ్రమంలో బాలిక లైంగికదాడికి గురై మృతి చెందిన ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీలో బాలల హక్కుల కమిషన్‌, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మహిళా కమిషన్‌ కార్యదర్శి జి.సునంద కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై తరువాత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను కలువనున్నట్లు అధికారులు తెలిపారు. ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే విషయంపై వివరాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి... 

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడితోపాటు  సహకరించిన వారిని, ఆమెపై దాడి చేసిన బంధువులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇలాంటి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టకూడదని ప్రభుత్వాన్ని కోరారు. 

ఆశ్రమం మూసివేత., చిన్నారుల తరలింపు.. 

బాలికపై లైంగికదాడి ఘటన జరిగిన అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి కాలనీ మారుతి ఆశ్రమంలో అనాథ చిన్నారులను అధికారులు తరలించారు. ఆశ్రమంలో సుమారుగా 90 మంది చిన్నారులు ఉంటున్నారు. వారిలో 20 మందిని తమ బంధువుల ఇండ్లకు తరలించారు. మిగిలినవారిని ఇతర అనాథాశ్రమాల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆశ్రమాన్ని ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మూసివేశారు.