గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 13, 2020 , 00:23:01

కరోనాను కట్టడి చేద్దాం

కరోనాను కట్టడి చేద్దాం

మెదక్‌ : నిబంధనలు పాటించి, కరోనాను కట్టడి చేద్దామని మెదక్‌ డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు అన్నారు. జిల్లాలో బుధవారం 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 479 మందికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. పట్టణంలో 9 మందికి, కౌడిపల్లిలో ఒకరికి, పాపన్నపేటలో ఒకరికి, రామాయంపేటలో నలుగురికి, పెద్దశంకరంపేటలో ఒకరికి, అల్లాదుర్గంలో ఏడుగురికి, హవేళిఘనపూర్‌లో ఒకరికి, తూప్రాన్‌లో ఏడుగురికి, నర్సాపూర్‌లో ఒకరికి, శివ్వంపేటలో ఒకరికి, కొల్చారంలో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకిందని తెలిపారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్నారు. బయటకు రావాల్సి వస్తే మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని జిల్లావాసులకు సూచించారు.

మిరుదొడ్డిలో ఐదు కరోనా కేసులు

మిరుదొడ్డి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 15 మందికి రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయగా,  అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ సీహెచ్‌వో లింగమూర్తి తెలిపారు.

తొగుట పీహెచ్‌సీలో ముగ్గురికి...

తొగుట : తొగుట పీహెచ్‌సీలో బుధవారం 35 మందికి కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యుడు వెంకటేశ్‌ తెలిపారు. కరోనా వచ్చిన వారు ఆరోగ్యంగా ఉండడంతో వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.    

దౌల్తాబాద్‌ మండలంలో ముగ్గురికి..

దౌల్తాబాద్‌ : దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆయా గ్రామాలకు చెందిన 20 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ముబారస్‌పూర్‌ గ్రామానికి చెందిన ఒకరికి, తిర్మలాపూర్‌ గ్రామంలో ఒకరికి, దౌల్తాబాద్‌ 108 అంబులెన్స్‌ వాహనంలో విధులు నిర్వహించే దొంగల ధర్మారం గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దౌల్తాబాద్‌ వైద్యాధికారి డాక్టర్‌ కర్ణ బండి తెలిపారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులు దౌల్తాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

హుస్నాబాద్‌లో ఒకరు మృతి 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు కరోనా బారినపడి బుధవారం మృతి చెందాడు. స్థానిక వైద్యులు, కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయన మృతితో పట్టణంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది. జూలై 3వ తేదీన హుస్నాబాద్‌ పట్టణంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా, ఇప్పటివరకు 63 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఇందులో సగానికిపైగా కోలుకొని యధావిధిగా తమ పనులు చేసుకుంటున్నారని, మిగతా పాజిటివ్‌ వచ్చినవాళ్లు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వారు తెలిపారు. హుస్నాబాద్‌ దవాఖానలో కరోనా ర్యాపిడ్‌  పరీక్షలు చేస్తున్నారని, స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. 


logo