బుధవారం 23 సెప్టెంబర్ 2020
Medak - Aug 13, 2020 , 00:23:35

సాగు భళా..పల్లె కళకళ

సాగు భళా..పల్లె కళకళ

  • పల్లెల్లో జోరుగా  సాగు పనులు
  • n గణనీయంగా పెరిగిన పంటల సాగు
  • n పుష్కలంగా సాగునీరు
  • n గోదావరి జలాలకు తోడు వర్షానికి నిండుగా  నీటి వనరులు  
  • n పడావు భూములు  సాగులోకి
  • n రైతు కూలీలు,  కులవృత్తుల వారికి  చేతినిండా పని  
  • n వ్యవసాయాధారిత  పరిశ్రమలకు ఫుల్‌ గిరాకీ
  • n వలస వెళ్లిన వాళ్లు  తిరుగుముఖం 
  • n మారిన పల్లె జీవన  ముఖచిత్రం

ప్రభుత్వ సహకారం, కాలం అనుకూలించడం.. వెరసి పల్లె తల్లి మురిసిపోతున్నది. ఏ పల్లె చూసినా ప్రస్తుతం పచ్చని పంట పొలాలు, జలధారలే దర్శనమిస్తున్నాయి. ఊరూరా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గోదావరి జలాలకు తోడు వర్షానికి నీటి వనరులన్నీ జలకళను సంతరించుకోగా, పడావు భూములన్నీ సాగులోకి వస్తున్నాయి. బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వారందరికీ ఇప్పుడే పల్లెలే ఉపాధిని కల్పిస్తున్నాయి. వారి రాకతో గ్రామసీమల్లో సందడి నెలకొన్నది. ఇవాళ పల్లెలు ఉపాధికి అడ్డాలుగా మారాయి. కూలీలు, కులవృత్తుల వారు, వలస వచ్చిన వారెందరో ఇప్పుడు ఇక్కడ గౌరవంగా బతుకుతున్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు గిరాకీ పెరిగింది. జిల్లాలో ఈ సారి రైతులు రికార్డు స్థాయిలో పంటలు వేశారు. నియంత్రిత సాగుకు రైతులు జైకొట్టారు. ఇంకనూ నాట్లు కొనసాగుతున్నాయి. కూలీలకు డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయాధారిత వ్యాపారాలు ఊపందుకున్నాయి. గ్రామీణుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. 

 - సిద్దిపేట, నమస్తే తెలంగాణ   

మారిన పల్లె జీవనం..

ప్రస్తుతం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ధైర్యం కనిపిస్తున్నది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. దీనికి కారణం పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన కరెంట్‌ సరఫరాతో ఎవుసం పండుగలా మారడం. వ్యవసాయాధారిత పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. గోదావరి జలాలతో పాటు వర్షానికి చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండు కుండలా కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు పెరుగడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జాలు పారుతున్నది. మరికొన్ని ప్రాంతాల్లో చెంబుతో నీళ్లు ముంచుకునే విధంగా బావుల్లో నీళ్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండడంతో అందరికీ పల్లెల్లో ఉపాధి లభిస్తున్నది. 

అన్ని కులవృత్తుల వారికి ఉపాధి..

వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో దీనిపై ఆధారపడిన కుల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతున్నది. ఊరికి చెరువు అదెరువు. చెరువుల పునరుద్ధరణతో ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు ముందు వరుసలో ఉన్నారు. చెరువు మీద ఆధారపడే కులవృత్తులైన రజకులు, కుమ్మరులు, బెస్త, కల్లుగీత, గొర్లు, పండ్లను సేకరించి అమ్ముకుని జీవించే వృత్తుల వారితో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవించే వడ్రంగులు, కమ్మరులకు గ్రామంలోనే జీవనోపాధి దొరుకుతున్నది. ఈసారి చెరువులతో పాటు రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టారు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. దీంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. చెరువులో నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయం పెరిగింది. ఫలితంగా కొత్తగా పొలాలను అచ్చుకడుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇంకా వరినాట్లు కొనసాగుతున్నాయి.  

ఉపాధినిస్తున్న పల్లెలు..

సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకుల విధానాలతో గ్రామాల్లో బతుకు దెరువు లేక ఎంతోమంది వలసపోయారు. ఇవాళ వారంతా తిరిగి పల్లెలకు చెరుకుని ఉపాధి పొందుతున్నారు. రైతుబీమా, రైతుబంధు, నాణ్యమైన ఉచిత కరెంట్‌ సరఫరా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, సకాలంలో విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం అందిస్తుండడంతో సాగుకు ఢోకా లేకుండా పోయింది. ‘రైతుబంధు’తో రైతుకు భరోసా ఏర్పడింది. వడ్డీ వ్యాపారుల బెడద రైతులకు తప్పింది. పల్లెల్లో పాడి పరిశ్రమ సైతం పెరిగింది. లీటరుకు నాలుగు రూపాయల అదనపు ఇన్సెంటీవ్‌ ప్రభుత్వం చెల్లిస్తుండడంతో చాలామంది పాడి పోషణకు ముందుకు వస్తున్నారు.  గొల్ల కుర్మలకు సబ్సిడీపై గొర్రెలు అందించడంతో వాళ్లు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని లభిస్తున్నది.  హరితహారంలో మొక్కలు నాటే పనులు, కాల్వల్లో పూడికతీత పనులు, ఫారంపాండ్‌లు, చేపల చెరువుల తవ్వకాలు తదితర పనులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో కూలీ రేట్లు అధికంగానే ఉన్నాయి. పత్తి, ఇతర కలుపుతీత పనులకు వెళ్లే వారికి రోజుకు రూ.250 వరకు ఇస్తున్నారు. వరినాట్లు, ముదురు తీత పనులకు రూ.300 నుంచి రూ.350 వరకు చెల్లిస్తున్నారు. ఎకరం వరినాటు వేయడానికి గుత్తకు రూ. 5,500 నుంచి రూ.6,000 వరకు ఇస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా రేట్లు మారుతున్నాయి. గుంటుక కొట్టడానికి ఒక రోజుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. 

ట్రాక్టర్లకు గిరాకీ..

జిల్లాలో పంటల సాగు పెరుగడంతో ట్రాక్టర్లకు గిరాకీ ఏర్పడింది. ఇది వరకు ఎద్దుల నాగళ్లతో పొలాలు దున్ని నాట్లు వేసేవారు. ప్రస్తుతం ఎద్దుల నాగళ్లు కనిపించకుండా పోయాయి. ప్రతి రైతు ట్రాక్టర్ల ద్వారానే సాగుచేస్తున్నారు. పుష్కలంగా సాగునీటితో ఈసారి పంటల సాగు పెరిగింది. బోరుబావుల నుంచి పుష్కలంగా నీరు వస్తుండడంతో రైతులు పడావు భూములను సైతం కొత్తగా పొలాలు అచ్చుకట్టి సాగుచేస్తున్నారు. చాలాచోట్ల ట్రాక్టర్లతో పొలాలు అచ్చుకడుతున్నారు. నాట్లు వేయడానికి భూములు  దున్నుతున్నారు. దీంతో పల్లెల్లో ట్రాక్టర్లకు గిరాకీ ఏర్పడింది. ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్లు కొనుగోలు చేసిన యజమానులు, దానిపై పనిచేసే కార్మికులు, ట్రాక్టర్‌ గ్యారేజీలకు పని దొరుకుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మద్దూరుతో పాటు పలు ప్రాంతాల్లో డీజిల్‌ను పని ప్రదేశాలకే తీసుకెళ్లి ట్రాక్లర్లలో పోస్తున్నారు. ఫోన్‌ కొడితే డీజిల్‌ సరఫరా చేస్తున్నారు. సాగుబడితో ముడిపడి ఉన్న దుకాణాల్లో వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. 

ఆదరించిన పల్లె తల్లి..

ఇప్పుడు పల్లెల్లో చేసుకున్నోడికి చేసుకున్నంతగా పని దొరుకుతున్నది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో కూలీల కొరత ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పించి పనులు చేయించుకుంటున్నారు.కూలీలను పని ప్రదేశానికి ట్రాక్టర్లు, ఆటోల్లో తీసుకెళ్లి, సాయంత్రం వారిని ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఒక్కో కూలీకి రూ. 300 ఇస్తామన్నా దొరకని పరిస్థితులు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి.కరోనా-లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్నం విడిచి పల్లెకు వచ్చిన వారందరికీ పనులు దొరుకుతున్నాయి. కిరాయికి ఉందామంటే ఇల్లు దొరకని పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. రూ. 500 నుంచి 1000 రూపాయల వరకు కిరాయి ఇస్తామన్న అద్దె ఇల్లు దొరకని పరిస్థితి  నేడు గ్రామాల్లో ఉండగా.. పట్టణాలు, నగరాల్లో ‘టులెట్‌ ’బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

గణనీయంగా పెరిగిన వరి సాగు..

సిద్దిపేట జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలకు మించి వరి సాగైంది. దీంతో అధికారులు ఇప్పటి నుంచే పంట ఉత్పత్తుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులు నియంత్రిత సాగుకు జైకొట్టారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది ఇతర పంటలు ఎక్కువగా సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, కంది సాగు వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు సెల్‌ఫోన్‌ సందేశం వచ్చింది. వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. అంచనాలకు మించి వరి సాగవుతోంది.  కొత్తగా పొలాలు అచ్చుకట్టి వరినాట్లు వేస్తున్నారు.  

మరమ్మతు షాప్‌ల వారికి గిరాకీ 

జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరుగడంతో  వ్యవసాయధారిత పరిశ్రమలకు మంచి గిరాకీ ఏర్పడింది. పడావు ఉన్న బావులు, బోర్లలో నీళ్లు పైకి రావడంతో పాత మోటర్లను మరమ్మతులు చేయించి బిగిస్తున్నారు. ఇదివరకు మూలకు పడ్డ మోటర్లను తిరిగి నడిపిస్తున్నారు దీంతో మోటరు మరమ్మతులు చేసే దుకాణాలు కళకళలాడుతున్నాయి.  కొన్నేండ్లుగా ఆశించిన పనులు లేక అవస్థలు పడ్డ్డ వారికి మంచి రోజులు వచ్చాయి. గిరాకీ పెరిగిందని పలువురు మెకానిక్‌లు తెలిపారు. కొత్త మోటర్లు కొనుగోలు, వ్యవసాయానికి సంబంధించిన పైపుల కొనుగోలు చేయడం తదితర వాటితో సంబంధిత దుకాణాల వ్యాపారం పుంజుకున్నది. 

పత్తికి మంచి ధర కల్పించాలి..

ముఖ్యమంత్రి సార్‌ చెప్పినట్లే నాకు ఉన్న మూడు ఎకరాల్లో పత్తి పంట వేసిన. పత్తికి మంచి ధర కల్పించి రైతులను మరింత అభివృద్ధి చేయాలి. కాలం అనుకూలించడంతో పాటు ప్రభుత్వం పెట్టుబడి అందించి, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచడంతో పంట ఏపుగా పెరిగింది. కూలీ రేట్లు కొంచం పెరుగడంతో ఇబ్బందిగా ఉంది. ప్రతి కూలీకి రూ.౩౦౦ వరకు చెల్లించి తెచ్చుకోవాల్సి వస్తున్నది.

- బండి చంద్రయ్య, రైతు, బెజ్జంకి 

ఊరికొచ్చి ఎవుసం చేసుకుంటున్న..

20 ఏండ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఆటో నడిపించుకుంటూ బతికిన. కరోనా రావడంతో ఆటోను ఎక్కేందుకు ఎవరూ రాకపోవడంతో అమ్మేసిన. భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామానికి వచ్చి నాకున్న భూమికి తోడుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేసిన. ఇప్పుడు ఎవుసమే నాకు జీవనాధారం. 

-మ్యాక కిష్టయ్య, రైతు, గాగిళ్లాపూర్‌

చేతినిండా పనిదొరుకుతున్నది..

నిన్నమొన్నటి వరకు పనులు లేక మోటర్‌ మెకానిక్‌ల మంతా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఊర్లల్లో చాలామంది కొత్తగా బోరుబావులు తవ్వి ఎవుసం చేస్తుండడంతో మాకు చేతినిండా పనిదొరుకుతున్నది. రోజుకు కొత్తగా రెండు నుంచి మూడు బోర్‌ మోటర్‌లు బిగిస్తున్నారు. మోటర్లు ఎక్కువ అవ్వడంతో రిపేర్‌ వర్క్‌ కూడా ఎక్కువగా దొరుకుతున్నది.

-గోలిపల్లి నర్సిరెడ్డి, మోటర్‌ మెకానిక్‌, నర్సాయపల్లి

వరినాట్లు అయిపోయాయి.. 

శనిగరం ప్రాజెక్టు కింద 8 ఎకరాల వరి నాటు వేసిన. రెండు ఎకరాల్లో పత్తి వేసిన. ఈసారి వర్షాలు ముందుగా వచ్చినయి. అనుకూలంగా వర్షాలు కురువడంతో పనులు త్వరగా పూర్తయినయి. చాలా సంతోషంగా ఉంది. ఏడెనిమిదేండ్లలో పనులు ఇంత త్వరగా ఎప్పుడూ పూర్తికాలే. శనిగరం ప్రాజెక్టులోకి నీరు వస్తున్నది. వచ్చేసారి కూడా పనులు ముందుగానే మొదలైతయి.

- గాజె శ్రీనివాస్‌, శనిగరం ప్రాజెక్టు ఆయకట్టు రైతు

వరి సాగు పెరిగింది.. 

సిద్దిపేట జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 2,08,469 ఎకరాల్లో నాట్లు వేశారు. గత వానకాలంలో 1,22,320 ఎకరాలు సాగైంది. రైతులు నియంత్రిత సాగును పాటించారు.  పత్తి, కంది, స్వీట్‌కార్న్‌ పంటలు సూచించిన మేర సాగుచేశారు. వరి సాగు మాత్రం బాగా పెరిగింది. ఈ ఏడాది గోదావరి జలాలు రావడంతో పాటుగా వర్షాలు పడుతుండడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో పడావు ఉన్న భూములను సైతం పొలాలు అచ్చుకట్టి వరినాట్లు వేస్తున్నారు. ఇంకా జిల్లాలో నాట్లు వేస్తున్నారు. దీంతో మరింతగా సాగు విస్తీర్ణం పెరగనున్నది.

- శ్రావణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి,సిద్దిపేట

సిద్దిపేట జిల్లాలో సాగు వివరాలు... 

గత వానకాలంలో సాగు వివరాలు, ప్రస్తుత సీజన్‌ సాగు వివరాలను పరిశీస్తే వరి సాగు గణనీయంగా పెరిగింది. ఇంకా నాట్లు కొనసాగుతుండడంతో వివరాలను సేకరించి వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పొందుపర్చిన  వివరాల ప్రకారం సాగు వివరాలు ఇలా ఉన్నాయి. logo