శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Medak - Aug 12, 2020 , 02:56:18

రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

  • n సాధారణ మరణం సంభవించినా  రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం 
  • n గత రెండేండ్లలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 4,804 మంది అన్నదాతల మరణం
  • n రూ.234 కోట్ల బీమా పరిహారం చెల్లింపు
  • n ఒక్క రైతు తరపున రూ.3,486 ప్రీమియాన్ని చెల్లిస్తున్న సర్కారు
  • n మరో ఏడాది పొడిగింపుతో అన్నదాతల హర్షం

రైతుబీమా పథకం కర్షకుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. గత రెండేండ్లుగా అమలు చేస్తున్న ఈ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించి అన్నదాతలకు అండగా నిలిచింది. సాధారణ మరణం సంభవించినా, ఆ రైతు కుటుంబానికి ఈ బీమా పథకం కింద రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని బీమా సంస్థ ఎల్‌ఐసీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. 2019 ఆగస్టులో రైతుబీమా పథకాన్ని ప్రారంభించగా, మరో ఏడాది 2021 ఆగస్టు వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. రెండేండ్లలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 4,471 మంది రైతులకు రూ. 234 కోట్ల పరిహారాన్ని బీమా సంస్థ బాధిత రైతు కుటుంబాలకు అందించింది. 

 - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతుబీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ప్రకటనతో మెతుకుసీమలో అన్నదాతల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. పథకంలో చేరిన రైతులు ఎలాంటి కారణాలతో చనిపోయిన బీమా సంస్థ రూ.5 లక్షలు ఆ కుటుంబానికి పరిహారంగా చెల్లిస్తున్నది. 2019 ఆగస్టులో రైతుబీమా పథకాన్ని ప్రారంభించగా, రెండేండ్లుగా సమర్థవంతంగా అమలవుతున్నది.మరో ఏడాది 2021 ఆగస్టు వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. రెండేండ్లలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 4,471 మంది రైతులకు రూ. 234 కోట్ల పరిహారాన్ని బీమా సంస్థ బాధిత రైతు కుటుంబాలకు అందించింది. 

ఉమ్మడి జిల్లాలో 7.89 లక్షల మంది రైతులు...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 7,89,220 మంది రైతులు ఉన్నారు. వీరిలో 4,40,897 మంది రైతులకు రైతుబీమా పథకం వర్తించింది. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు వారిని పథకానికి అర్హులుగా గుర్తిస్తున్నారు. ఏటా అర్హుల సంఖ్యలో మార్పులు జరుగుతుంటాయి. 1961 ఆగస్టు 14 నుంచి 2002 ఆగస్టు 14 మధ్యలో పుట్టిన వారిని ఆధారు కార్డు ఆధారంగా అధికారులు గుర్తిస్తున్నారు. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల  మధ్య వయస్సున్న వారు అర్హులన్న మాట. ఈ లెక్కన గతేడాది ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 4.40 లక్షల మంది రైతులు అర్హత పొందారు. ఇటీవల కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాల పొందిన రైతులకు ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయనుంది.  

రూ.234 కోట్లు చెల్లింపు...

రైతుబీమా పథకం ద్వారా గత రెండేండ్లలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 4,471 రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. రెండేండ్లలో 4,804మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. ఇందులో 4,471 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రూ.234 కోట్ల పరిహారాన్ని బీమా సంస్థ చెల్లించింది. ఒక్కో రైతుకు బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థ ఎల్‌ఐసీకి రూ.3,486.90 చొప్పున ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. రైతు పైసా చెల్లించకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రైతుకు బీమా వర్తింపజేస్తున్నది. సాధారణ మరణాలకు బీమా పరిహారాన్ని చెల్లిస్తుండడం ఈ బీమా పథకం ప్రత్యేకత. 2019 ఆగస్టులో రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికి రెండేండ్లు పూర్తి కాగా, మూడో ఏడాది 2021 ఆగస్టు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో రెండేండ్లలో 1769 మంది అకాల మరణం పొంది, రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం పొందారు. మరికొన్ని ఫైళ్లు చెల్లింపు ప్రక్రియలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో రెండేండ్లలో 1341 మంది, మెదక్‌ జిల్లాలో 1367 మంది రైతు కుటుంబాలకు బీమా పథకం ఆర్థిక భరోసాను కల్పించింది. 

బీమా డబ్బులతో ఆర్థిక భరోసా...

రైతుబీమా పథకం ద్వారా అందుతున్న రూ.5 లక్షల పరిహారం రైతు కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నది. ఇంటి పెద్దదిక్కు ప్రాణాలు కోల్పోడంతో వచ్చిన డబ్బులతో ఆడపిల్లల పెండ్ల్లిలు చేస్తున్నారు. పిల్లలను చదివించుకోవడంతో పాటు పలువురు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతు మరణిస్తే విచారణ పేరుతో ఏండ్లు గడిపి, చివరకు ఇచ్చే అరకొర పరిహారం ఎందుకు సరిపోయేది కాదు. ఇప్పుడు మాత్రం రూ.5 లక్షలు కుటుంబానికి కొండంత భరోసానిస్తున్నాయి. రైతు సంక్షేమాన్ని కోరుకున్న సీఎం కేసీఆర్‌, మరోసారి రైతుబీమా పథకాన్ని పొడిగించి తమకు అండగా నిలుస్తున్నదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


logo