శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Aug 11, 2020 , 00:01:29

మెదక్‌ జిల్లాలో మోస్తరు వర్షం

మెదక్‌ జిల్లాలో  మోస్తరు వర్షం

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నెల రోజుల కింద రైతులు వరినాట్లు వేయగా, ఇప్పటి వరకు అడపాదడపా వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాలు జిల్లాలో వర్షాలు భారీగా కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నిజాంపేటలో 49.3 మి.మీ వర్షపాతం నమోదుకాగా, రేగోడ్‌లో 40.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాపన్నపేటలో 45.0 మి.మీ, కొల్చారంలో 38.5 మి.మీ, చిలిపిచెడ్‌లో 34.0 మి.మీ, హవేళిఘనపూర్‌లో 38.2 మి.మీ, రామాయంపేటలో 31.5 మి.మీ, కౌడిపల్లిలో 22.2 మి.మీ, పెద్దశంకరంపేటలో 30.4 మి.మీ,  మెదక్‌లో 29.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా జూన్‌ నెలలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.  

ఆనందంలో రైతులు...

నెల రోజుల కింద వరి నాట్లు వేసిన రైతన్నలకు వర్షంతో ఊరట లభించింది. బోరుబావుల వద్ద వేసిన వరి నాట్లల్లో నీరు ఉండగా, ఇతర ప్రాంతాల్లో వేసిన పొలాల్లో నీరు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. దీంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఇంకా వరి నాట్లు వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వరి నాట్లు జోరందుకున్నాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు పే ర్కొంటున్నారు.

ముసురుతో కూడిన వర్షం

మెదక్‌ రూరల్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా మండలంలో ముసురుతో కూడిన వర్షం కురుస్తున్నది. మండలంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 29.మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి వరకు ముసురుతో కూడిన వర్షం కురుస్తూనే ఉన్నది. ఈ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలోక్లి భారీగా నీరు చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పెద్దశంకరంపేటలో 30.2 మి.మీ వర్షం  

పెద్దశంకరంపేట : మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 30.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఆరుతడి పంటలకు ఈ వర్షం వల్ల ఎంతో మేలు చేకూరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   బోరుబావుల్లోకి పుష్కలంగా నీరు రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

టేక్మాల్‌ మండలంలో...

టేక్మాల్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షం కురుస్తున్నది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పంట పొలాల్లో వరద నీరు చేరింది. పత్తి పంటకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం లభించింది. 

చిన్నశంకరంపేటలో...

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  వర్షం కురిసింది. పంటపొలాల్లో నీరు చేరడంతో మండలంలోని వివిధ గ్రామాల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అల్లాదుర్గంలో...

అల్లాదుర్గం : ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం ఉదయంనుంచి వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరినాట్లు వేసి ఎదురుచూస్తున్న రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.