గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 08, 2020 , 23:16:42

ప్రతి ఇల్లుపాఠశాల కావాలి

ప్రతి ఇల్లుపాఠశాల కావాలి

టేక్మాల్‌: చిన్నారులకు విజ్ఞానం ఎంత అవసరమో... వినోదమూ అంతే అవసరం... అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డాయి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులే గురువుల పాత్రను పోషించి తమ పిల్లలకు విద్యనందించాలి. నేటి పోటీ ప్రపంచంలో చదువుతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ఎంతో అవసరం. కాబట్టి ఆ దిశగా తమ పిల్లలను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళిక వేసుకుంటే ఈ సెలవులను సద్వినియోగం చేసుకున్నట్లే...

మెదడుకు మేత...

చిన్నారుల మెదడు చురుగ్గా ఉంచాలంటే దానికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. పిల్లల మెదడును చురుగ్గా ఉంచే ప్రతి ప్రయత్నాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చెస్‌, సుడోకు, ఫజిల్స్‌ వంటివి మెదడును ఉత్తేజపరుస్తాయి. తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని బట్టి ఫజిల్స్‌ నేర్పించాలి. ఇలా మెదడుకు మేతతో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది. 

భాషపై పట్టు..

భాష మీద పట్టు అవసరం. అది ఏదైనా కావచ్చు. తెలుగు మాతృభాష అయితే ఇంగ్లిష్‌ బతుకు భాష. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సంభాషించడానికి ఇంగ్లిష్‌ అవసరం. భాష వేరుకమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వేరు. భాష అనేది అందులో ఒక భాగం మాత్రమే. ఈ సెలవుల్లో భాష మీద పట్టు సాధించడానికి దృష్టి పెడితే అది మనల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. 

చేతిరాత మెరుగుతో...

పరీక్షల్లో చేతి రాత చాలా ముఖ్యం. ఏ పరీక్ష అయినా మీరు రాసే సమాధానాలను మంచి చేతిరాతతో రాస్తే చదవడానికి ఎంతో బాగుంటుంది. దీంతో ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతి రాతను మెరుగుపర్చుకునేందుకు ఈ సెలవులను సద్వినియోగం చేసుకుంటే మంచిది. 

ప్రతిభకు పదును పెట్టుకోవడం..

గణితంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్‌, వేద గణితం, గణితంలో మెళకువలతో ప్రతిభను సాధించవచ్చు. ఈ సెలవుల్లో బాగా సాధన చేసి ప్రతిభకు పదును పెట్టుకోవచ్చు. ఇష్టంతో నేర్చుకోవడాన్నే ఎంజాయిమెంట్‌ అని విద్యార్థులకు తల్లిదండ్రులు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ దిశగా వారిని అలవాటు చేయాలి.

టెక్నాలజీని సొంతం చేసుకోవాలి...

నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పని కూడా జరుగడం లేదు. కంఫ్యూటర్‌ టెక్నాలజీ నేడు ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరంగా మారిందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలను సైతం బోధిస్తున్నారు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.


logo