శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 08, 2020 , 22:54:05

స్త్రీనిధి మహిళల పాలిట పెన్నిధి

స్త్రీనిధి మహిళల పాలిట పెన్నిధి

మెదక్‌: మహిళా స్వయం సహాయక సంఘాలు మరింతగా బలపడేందుకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. మైక్రోఫైనాన్స్‌ సంస్థల ఉచ్చులో చిక్కుకొని ఇబ్బందులకు గురికాకుండా,  స్త్రీనిధి కింద విరివిగా రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నది. స్త్రీనిధి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూరుతున్నది. ఈ రుణాలతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, యూ నిట్లు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. వ్యాపారం చేసుకుంటూ కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు కిరాణం, టైలరింగ్‌తోపాటు డెయిరీ ఫాం, ఇతర చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. 

లక్ష్యం రూ.78.47 కోట్లు...

2020-21 ఆర్థిక సంవత్సరంలో మెదక్‌ జిల్లాలో స్త్రీనిధి రుణాలు రూ.78.47 కోట్ల గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మెదక్‌ జిల్లాలో 12,189 మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) ఉన్నాయి. ఇందులో 1,30,914 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఇప్పటి వరకు రూ.8.90 కోట్ల రుణాలు అందజేశారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారందరికీ స్త్రీ నిధి రుణాలను అందించాలనే ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రూ.83 కోట్ల స్త్రీనిధి రుణాలు సభ్యులకు అందజేశారు. పొదుపు సంఘాల్లో సమయానికి డబ్బులు చెల్లిస్తున్న సంఘాలను గుర్తించి, వారికి స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు. మహిళా సంఘాల సభ్యులకు ఎవరెవరికీ ఎంత రుణం అందజేయాలనే ప్రణాళికలు తయారుచేసి స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. 

కరోనా కష్టకాలంలో కొండంత ఆసరా...

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని నెలలుగా అంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌తో కొన్ని నెలల పాటు అన్ని వ్యాపారాలు మూసుకోవాల్సి వచ్చింది. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొలువులు పోవడం, వేతనాల కోత వంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబాలు గడవడం కష్టం మారింది. ఈ కష్టకాలంలో స్త్రీనిధి రుణాలు మహిళలకు కొండంత ఆసరా అయ్యాయి. కరోనాతో బయట అప్పులు పుట్టని పరిస్థితి ఉంది. ఈ సమయంలో వారిని స్త్రీనిధి రుణాలు ఆర్థిక భరోసానిస్తున్నాయి.

అర్హులందరికీ అందిస్తాం..

జిల్లాలో అర్హులైన మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులందరికీ స్త్రీనిధి రుణాలు అందిస్తాం. జిల్లా టార్గెట్‌ రూ.78.47 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.8.90 కోట్లను అందజేశాం. స్త్రీనిధి రుణాల లక్ష్యా న్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాం. వారానికోసారి సమావేశాలు నిర్వహిస్తున్నాం. రుణాలు తీసుకున్న సభ్యులు డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి.-శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, మెదక్‌logo